
ఆ వ్యవస్ధలపై పెరుగుతున్న జగన్ పట్టు-నీలం, సవాంగ్ నియామకాలతో-ఇక మిగిలింది అదొక్కటే
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో మూడు రాజ్యాంగ వ్యవస్ధలతో ప్రభుత్వానికి పొసగలేదు. దీంతో ఓ దశలో సీఎం జగన్ సైతం నేరుగా వాటిపై ప్రెస్ మీట్లు పెట్టి మరీ వాటిని కడిగేశారు. అంతే కాదు అనంతర కాలంలో ఆయా వ్యవస్ధల్లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఈ క్రమంలో ఎన్ని విమర్శలు ఎదురైనా లెక్క చేయలేదు. ఎట్టకేలకు ఆయా వ్యవస్ధలపై సీఎం జగన్ కు క్రమంగా పట్టు చిక్కుతోంది. దీంతో ఒకప్పుడు తమ చెప్పుచేతల్లో లేవంటూ బాధపడిన వ్యవస్ధలన్నీ తిరిగి జగన్ గుప్పిట్లోకి చేరుతున్నాయి.
Recommended Video

జగన్ వర్సెస్ రాజ్యాంగ వ్యవస్ధలు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీఎస్ఈసీ, ఏపీపీఎస్సీ, ఏపీ వక్ఫ్ బోర్డు, ఏపీ శాసనమండలి ఛైర్మన్ల రూపంలో నాలుగు సవాళ్లు ఎదురయ్యాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వం వాటిని తమ అదుపులోకి తెచ్చుకోవడానికి తీవ్ర ప్రయత్నాలే చేసింది. స్ధానిక ఎన్నికల సందర్భంగా ఏపీఎస్ఈసీ, పరీక్షల సందర్భంగా ఏపీపీఎస్సీ, నియామకాల రూపంలో ఏపీ వక్ఫ్ బోర్డు, మూడు రాజధానుల నేపథ్యంలో శాసనమండలి నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. వీటిని ఎదుర్కొనేందుకు వైఎస్ జగన్ .. శాసనమమండలి రద్దు, నిమ్మగడ్డ తొలగింపు, ఏపీపీఎస్సీ కార్యదర్శి చేతుల్లో పగ్గాలు పెట్టడం, వక్ఫ్ బోర్డు కార్యకలాపాల్ని వదిలేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇవేవీ పనిచేయలేదు.

జగన్-నిమ్మగడ్డ పోరు
ఏపీలో 2020లో స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనూహ్యంగా వాటికి కరోనా పేరుతో బ్రేక్ వేశారు. ఆ తర్వాత ఆయన్ను తొలగించి మరీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ కోర్టుల్లో ఎదురుదెబ్బలతో అవేవీ ఫలించలేదు. తిరిగి పదవిలోకి వచ్చిన నిమ్మగడ్డ తాను అనుకున్నట్లుగానే స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన స్ధానంలో ప్రభుత్వం మాజీ సీఎస్ నీలం సాహ్నీని నియమించడంతో ఎస్ఈసీ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చింది.

జగన్-మండలి పోరు
ఏపీలో మూడు రాజధానుల బిల్లుల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మండలిలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని అప్పటి ఛైర్మన్, టీడీపీ నేత షరీఫ్ అడ్డుకున్నారు. దీంతో ఏకంగా మండలినే రద్దు చేయాలంటూ వైసీపీ సర్కార్.. అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపింది. చివరికి ఏడాదిలోనే మండలిలో మెజారిటీ వచ్చేయడంతో ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది. అంతే కాదు కొత్తగా ఎమ్మెల్సీ అయిన మోషేన్ రాజును ఛైర్మన్ గా, జకీయా ఖానమ్ ను వైస్ ఛైర్మన్ గా నియమించి మండలిపై పట్టు సంపాదించింది.

జగన్ -ఉదయభాస్కర్ పోరు
టీడీపీ హయాంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించిన ఉదయ్ భాస్కర్ తో సైతం వైసీపీ సర్కార్ కు పొసగలేదు. దీంతో ఆయన్ను తప్పించేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే అవి సాద్యం కాదని తేలిపోవడంతో ఆయన ఉండగానే కార్యదర్శిగా పీఎస్ఆర్ ఆంజనేయుల్ని నియమించి ఆయనతోనే అన్ని నిర్ణయాలు తీసుకునేలా చేసింది. దీంతో ఆయన నామమాత్రంగా మారిపోయారు. ఏపీపీఎస్సీ కార్యాలయంలో అటెండరు కూడా తనమాట వినడం లేదంటూ ఉదయ్ భాస్కర్ గవర్నర్ కు మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం లేదు. చివరికి ఉదయ్ భాస్కర్ పదవీకాలం ముగియడంతో ఆయన స్ధానంలో తాజాగా డీజీపీ పదవి నుంచి తొలగించిన గౌతం సవాంగ్ కు అవకాశం దక్కింది. తద్వారా తమ ప్రభుత్వానికి నమ్మకస్తుడైన సవాంగ్ ను నియమించి ఏపీపీఎస్సీపైనా జగన్ పట్టు సాధించారు.

ఇక మిగిలింది వక్ఫ్ బోర్డ్ మాత్రమే
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ కు సవాళ్లు విసిరిన నాలుగు వ్యవస్ధల్లో మూడింటిని ఇప్పటికే ఏదో రూపంలో తన అదుపులోకి తెచ్చుకున్న వైసీపీ సర్కార్.. ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ పైనా దృష్టిపెట్టింది. ఎప్పుడో కాలం ముగిసిన వక్ఫ్ బోర్డ్ సభ్యుల్ని తాజాగా నియమించడంతో పాటు ఛైర్మన్ నియామకానికి కూడా సిద్దమవుతోంది. సినీ నటుడు అలీని వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ గా నియమించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. అది కూడా జరిగిపోతే ఇక జగన్ కు సవాళ్లు విసిరిన నాలుగో వ్యవస్ధను సైతం తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నట్లవుతుంది.