9 నెలల్లో 9 కోట్లు దాటిన అన్నప్రసాద వితరణ: తిరుమలలో శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్
ఇల వైకుంఠంలా భాసిల్లుతోన్న తిరుమలలో గల శ్రీవేంకటేశ్వర అన్నదాన ట్రస్ట్ కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే ఏ ఒక్క భక్తుడూ ఆకలితో వెనుతిరగకూడదనే ఉద్దేశంతో టీటీడీ ప్రతిరోజూ దాదాపు 1.8 లక్షల మందికి రుచికరమైన అన్నప్రసాదాలను అందిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత అన్నదాన కేంద్రంగా ప్రసిద్ధి చెందిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అక్షయపాత్రగా వర్ధిల్లుతోంది.
రోజూ రెండు లక్షలమందికి..
తిరుమలలో ఆకలితో ఉన్న భక్తుడికి అన్నం అందించడమే లక్ష్యంగా టీటీడీ అన్నప్రసాదం విభాగం 24 గంటలూ నిరంతరం పనిచేస్తోంది. సాధారణ రోజుల్లో సుమారు 1.80 లక్షల నుంచి 1.90 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుండగా, రద్దీ రోజులు, వారాంతాల్లో ఈ సంఖ్య మూడు లక్షలకు మించుతోంది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కలిపి రోజుకు దాదాపు మూడు లక్షల సర్వింగ్స్ భక్తులకు అందుతున్నాయి.

మూడు షిఫ్టుల్లో..
తిరుమలలోని అన్నప్రసాద కేంద్రం, శ్రీ అక్షయ, వకుళమాత వంటశాలలు 24 గంటలూ పనిచేస్తూ భక్తులకు ఆహారాన్ని అందిస్తున్నాయి. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో రోజుకు 80,000 మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం అందుతోంది. ఇక్కడ ఉదయం ఉప్మా, పొంగలి, చట్నీ, సాంబార్ వంటి అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి అన్నం, కూర, చట్నీ, వడ, సాంబార్, రసం, మజ్జిగ, స్వీట్ పొంగల్ తదితర పదార్థాలను భక్తులకు వడ్డిస్తారు.
ఎక్కడెక్కడ ఏఏ ప్రసాదాలు..
శ్రీ అక్షయ వంటశాలలో గోధుమ రవ్వ ఉప్మా, సుజీ రవ్వ ఉప్మా, పొంగలి, సాంబారన్నం, పెరుగన్నం, టమోటా రైస్, సుండలు, పాలు, టీ, కాఫీ తదితరాలను తయారు చేస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే పర్వదినాల్లో మజ్జిగ, బాదం పాలు, బిస్కెట్లు, జ్యూస్ ప్యాకెట్లను కూడా పంపిణీ చేస్తారు. వకుళమాత వంటశాల ద్వారా యాత్రికుల వసతి సముదాయాలు, సీఆర్ఓ, రామ్‌భగీచా అతిథి గృహం, అంజనాద్రి నిలయం తదితర ప్రాంతాల్లోని భక్తులకు అన్న ప్రసాదాలు అందుతాయి.
ముడిసరుకుల వివరాలివే..
లక్షలాది మంది భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ ప్రతిరోజూ భారీ స్థాయిలో ముడి పదార్థాలను వినియోగిస్తోంది. రోజుకు సుమారు 15,788 కిలోల బియ్యం, 3,110 కిలోల సన్‌ఫ్లవర్ ఆయిల్, 2,861 కిలోల కందిపప్పు, 2,832 కిలోల సుజీ రవ్వ, 2,825 కిలోల గోధుమ రవ్వ, 1,729 కిలోల మినప్పప్పు, 1,436 కిలోల ఉప్పు, 1,276 కిలోల బెల్లం, 497 కిలోల చింతపండు వినియోగిస్తారు. రోజుకు సుమారు 4,375 కొబ్బరికాయలు, 430 కిలోల చక్కెర, 309 కిలోల ఎండు మిర్చి, 209 కిలోల ధనియాలు తదితర ముడి పదార్థాలను వాడుతారు.
9 కోట్లు దాటిన సర్వింగ్స్..
ఈ ఏడాది జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30వ తేది వరకు అంటే ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో తిరుమలలోని వివిధ అన్నప్రసాద కేంద్రాల ద్వారా తొమ్మిది కోట్లకు పైగా సర్వింగ్స్ భక్తులకు అందించారంటే మాటలు కాదు. ఇదో రికార్డ్. 2024లో వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించి అదనంగా 28 ప్రాంతాలకు ఆహార పంపిణీ సేవలను విస్తరించింది. ఏడాది ముందు ప్రారంభించిన పీఏసీ 5లో ఒకేసారి 1,500 మంది భోజనం చేసే సామర్థ్యంతో డైనింగ్ హాళ్లు అందుబాటులో ఉన్నాయి.
శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్..
రోజుకు రెండు లక్షల మంది భక్తులకు ఆహారం తయారు చేయగల సామర్థ్యంతో నూతన శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే అన్నప్రసాదాల వితరణ మరింత వేగవంతమౌతుందని టీటీడీ అంచనా వేస్తోంది. శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ వద్ద ప్రస్తుతం రూ. 2,900 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ నిధులపై వచ్చే ఆదాయంతో లక్షలాది మంది భక్తులకు నిత్యం ఉచితంగా నాణ్యమైన అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications
