Tirumala: సుప్రభాత స్థానంలో తిరుప్పావై..ధనుర్మాసం వేళ ప్రత్యేక నిర్ణయాలు
టిటిడీ తిరుమల సేవల గురించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 17 నుంచి తిరుమలలో ఉదయం సుప్రభాత సేవను రద్దు చేస్తున్నట్లు టిటిడీ అధికారులు ప్రకటించారు. నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా తిరుమల వారి సన్నిధిలో వినిపించే సుప్రభాత సేవను రద్దు చేస్తున్నారు. సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై పారాయణంతో స్వామి వారికి మేల్కొలుపు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో రోజూ నిర్వహించే సేవల్లో అతి ముఖ్యమైంది సుప్రభాత సేవ. ఈ సుప్రభాత సేవ అనంతరం అలంకరణ, అర్చనలను ప్రారంభిస్తారు. ఈ సేవ పూర్తయిన తర్వాతనే భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. డిసెంబర్ 17 నుంచి అంటే నేటి నుంచి ధనుర్మాసం సందర్భంగా తిరుమలలో ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ నెల రోజుల పాటు సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పారాయణం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇక, ఈనెల 19 వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా కొన్ని దర్శనాలను బ్రేక్ పడినట్లు అధికారులు వెల్లడించారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాదన సేవలను రద్దు చేస్తున్నట్లు దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. డిసెంబర్ 18న జరిగే సిఫార్సు లేఖల స్వీకరణను కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
శనివారం నుంచి తిరుపతి విమానాశ్రయంలో ఇచ్చే శ్రీవాణి దర్శన టిక్కెట్ల కౌంటర్‌ను కూడా మూసివేస్తున్నట్లు చెప్పారు. శనివారం నాటి నుంచి తిరుమలలోని గోకులం అతిథి గృహంలో ప్రత్యేక కౌంటర్ ద్వారా విమాన ప్రయాణికులకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రోజుకి 100 చొప్పున బోర్డింగ్ పాసులు కలిగిన భక్తులకు మాత్రమే టిక్కెట్లను కేటాయిస్తామని టిటిడి స్పష్టం చేసింది. ఇక, ఈనెల 22 నుంచి ఆఫ్‌లైన్ విధానంలో సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రోజుకు 42,500 చొప్పున 10 రోజులకు 4.25 లక్షల టోకెన్లను ఇచ్చేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications