కూటమిలో మరో చిచ్చు - ఢిల్లీ సీరియస్..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అయింది. మూడు పార్టీల కూటమిలో కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో కూటమి పార్టీల నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కడప జిల్లాలో 2024 ఎన్నికల్లో కూటమి అనూహ్య ఫలితాలు సాధించింది. జగన్ సొంత జిల్లాలో ఇప్పుడు కూటమి పార్టీ నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ - జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి మధ్య రచ్చ ఇప్పుడు జిల్లాలో కూటమి కి సమస్యగా మారుతోంది.
దశాబ్ద కాల వైరం
కడప జిల్లాలో కూటమి నేతల విభేదాల వ్యవహారం పతాక స్థాయికి చేరుతోంది. కొద్ది రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి - ఆదినారాయణ మధ్య బూదిడ వివాదం సీఎంఓ వరకు వెళ్లింది. చంద్రబాబు జోక్యంతో ఆ వివాదం తాత్కాలికింగా ముగిసింది. పులివెందులలో బీటెక్ రవీ, ఎమ్మెల్సీ రాం గోపాల్ రెడ్డి మధ్య విభేదాలు దాడుల వరకు వెళ్లాయి. రాం గోపాల్ రెడ్డి మద్దతు దారులను బీటెక్ రవి అనుచరులు నిర్భంధించటం.. కొట్టటం పార్టీలో రచ్చగా మారింది. ఇద్దరూ ఒకరి పైన మరొకరు నేరుగా పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు చేసుకున్నారు. ఇప్పుడు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు జమ్మలమడుగులో మరో వివాదంగా మారింది.

ముదురుతున్న వివాదం
ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య వర్గపోరు తతారా స్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు బహిరంగ విమర్శలకు దిగటం కూటమి నేతలకు సమస్యగా మారుతోంది. ఏళ్ల తరబడి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సీఎం రమేశ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో ఆదినారాయణరెడ్డి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇరువురి మధ్య అప్పటి నుంచే ఉన్న పోరు ఇప్పటికీ ఒకే పార్టీలోకి వచ్చినా కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య ఈ ఆధిపత్య పోరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత తీవ్రమైంది. తాజాగా సీఎం రమేశ్ కుటుంబానికి చెందిన వర్గానికి ముద్దనూరులో మద్యం దుకాణాలు లాటరీలో వచ్చాయి.
ఆధిపత్యం కోసం
అక్కడ అద్దెకు గదులు ఇవ్వకుండా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డుకుంది. దీంతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. కొండాపురం మండలంలో అదానీ సంస్థ దక్కిన పంప్డ్ స్టోరేజీ సోలార్ ప్రాజెక్టు పనులను సీఎం రమేశ్‌కు చెందిన రుత్విక్ కంపెనీ సబ్ కాంట్రాక్టు తీసుకుంది. ప్లాంట్ పనులను ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడు, అనుచరులు అడ్డుకు రు. దీంతో, ఎంపీ రమేశ్ జమ్మలమడుగులో రిపబ్లిక్ క్లబ్ పేరుతో విచ్చలవిడిగా జూదం, గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ రోజుకు లక్షల్లో పందెం జరుగుతోందని ఫిర్యాదు చేసారు. దీంతో అధికారులు క్లబ్ మూయించేసారు. దీని పై ఎమ్మెల్యే అది సీరియస్ అయ్యారు. బీజేపీ నేతల తీరు పైన ఢిల్లీ వరకు ఫిర్యాదులు వెళ్లాయి. దీని పైన బీజేపీ అధినాయకత్వం సైతం ఆగ్రహంతో ఉంది. ఈ పరిణామాలు కూటమిలో రచ్చగా మారుతున్నాయనే అభిప్రాయం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications