సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు రఘురామ - ప్రధానికి మరో లేఖ..!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు న్యాయస్థానాలు..లోక్ సభ అండగా లేకపోయినా ప్రజలు తనతో ఉంటారని ధీమా వ్యక్తం చేసారు. తనకు జరిగిన అన్యాయానికి లోక్ సభ ద్వారా పూర్తిగా న్యాయం జరుగుతుందని నమ్మకం తనకైతే లేదన్నారు. చంద్రబాబు తనకు జరిగిన అన్యాయం పై పలుమార్లు ప్రస్తావించారని గుర్తు చేసారు. తనకు జరిగి అన్యాయం పైన ప్రధానికి లేఖ రాసినట్లు రఘురామ వెల్లడించారు. సుప్రీంకోర్టు లో పిటీషన్ దాఖలు చేసి 19 నెలలు అవుతుందన్నారు. కేసు ఇప్పటికీ విచారణ జరగలేదని..ఇందులో సీఎం ప్రమేయం ఉందని ఆరోపించారు.

ప్రధానికి రఘురామ లేఖ
పోలీస్ కస్టడీ తాను ఎదుర్కొన్న చిత్రహింసలను రఘురామ మరోసారి ప్రస్తావించారు. ఇదే అంశంపై ప్రధానమంత్రికి లేఖ రాసినట్లు పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, మరొకసారి దేశంలోని ఎనిమిది వందల మంది ఎంపీలకు తన కష్టాన్ని వివరిస్తూ లేఖలు రాయనున్నట్లు తెలిపారు. పోలీస్ కస్టడీలో తనని చిత్రహింసలకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, తన కుమారుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు. పిటీషన్ దాఖలు చేసే 19 మాసాలు పూర్తి కావొస్తుందని చెప్పిన రఘురామ, ఈ 19 మాసాల వ్యవధిలో 30 సార్లు మెన్షన్ చేసినప్పటికీ, కేసు విచారణ జరగలేదని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ప్రమేయంతోనే ఇలా జరిగిందని రఘురామ అనుమానం వ్యక్తం చేసారు.

సుప్రీంకోర్టులో 19 నెలల తరువాత
సుప్రీంకోర్టులో పిటీషన్ విత్ డ్రా చేసుకొని హైకోర్టుకు వెళ్తారా అని ప్రశ్నించడం జరిగిందని... దానికి తాను సమ్మతించినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు కనీసం 19 నెలల తర్వాత అయిన హైకోర్టుకు వెళ్ళమని చెప్పిందని, పార్లమెంట్ ప్రివలేజీ కమిటీ మాత్రం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని రఘురామ వాపోయారు. పోలీస్ కస్టడీలో తనను చిత్రహింసలకు గురిచేసిన పోలీసు అధికారుల పేర్లు ప్రివిలేజ్ కమిటీ ముందు తాను వెల్లడించానన్నారు. అయినా సదరు అధికారులను పిలిచి విచారించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తనను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ప్రివలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయగానే, సంబంధిత అధికారులను పిలిచి విచారించారని గుర్తు చేశారు.

లోక్ సభలో న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు
తనని పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారని సుప్రీంకోర్టు నిర్ధారించిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే మిలటరీ ఆసుపత్రిలో అప్పటి హైకోర్టు రిజిస్టార్ జనరల్ తో పాటుగా ప్రస్తుత హైకోర్టు జడ్జి సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని రఘురామ చెప్పుకొచ్చారు. పోలీసులు కస్టడీలో చిత్రహింసలకు గురి చేయడం వల్ల తీవ్ర గాయాలు, తన వేలు విరిగిపోయిందన్న నివేదిక ఆధారంగానే సుప్రీంకోర్టు తనకు బెయిల్ మంజూరు చేసిందని గుర్తు చేశారు. పోలీసు కస్టడీలో తనని చిత్రహింసలకు గురిచేసినట్లు నిర్ధారణ అయినప్పటికీ, మెజిస్ట్రేట్ ముందు తాను వాంగ్మూలం ఇచ్చినప్పటికీ, ఎవ్వరి పైన కేసులు నమోదు చేయలేదని రఘురామ వాపోయారు.












Click it and Unblock the Notifications