రాహుల్ గాంధీ ఆస్తులపై విచారణ ..! సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!
లోక్ సభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అక్రమాస్తుల్ని కలిగి ఉన్నారని, ఆయనపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేయించాలంటూ కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్.విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ గతంలో ఆయా సంస్దలకు విచారణ ఆదేశాలు ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టుతో పాటు సీబీఐ, ఈడీలకు కీలక ఆదేశాలిచ్చింది.
జూలై 20న అలహాబాద్ హైకోర్టు పిటిషనర్ ఆరోపణల్ని ధృవీకరించారని సీబీఐకి, అలాగే తమ విచారణలో ఏదైనా చట్టవిరుద్ధతకు సంబంధించిన ఆధారాలు లభిస్తే తగిన చర్యలు తీసుకోవడానికి ఈడీకి అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత సీబీఐ స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. విచారణ పురోగతిని వివరిస్తూ కొత్త అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. వీటిపై రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అనంతరం ఈ కేసుపై ముందుకెళ్లొద్దని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది.

అలాగే దర్యాప్తు ఆధారంగా రాహుల్ ఆస్తుల ఆరోపణల కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టుతో సహా ఏ అధికార సంస్థకూ ఎలాంటి దర్యాప్తు నివేదికను సమర్పించవద్దని సీబీఐ, ఈడీల్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాహుల్ గాంధీ పిటిషన్ పై విచారణ జరిపిన సీజేఐ సూర్యకాంత్, న్యాయమూర్తులు జయమాల్య బాగ్చీ, వి.మోహనలతో కూడిన ధర్మాసనం... సీబీఐ లాయర్ కు అక్షింతలు వేసింది. ఈ కేసులో విషయం అంత తీవ్రమైనదైతే, దర్యాప్తు సంస్థలు ఎందుకు మౌనం వహించాయని ప్రశ్నించింది. అలాగే తాము ఈ కేసుపై తదుపరి విచారణ జరిపే వరకూ.. ఆగస్టు 20న జరగాల్సిన విచారణను వాయిదా వేయాలని అలహాబాద్ హైకోర్టుకు సూచించింది.














Click it and Unblock the Notifications