రఘురామ అరెస్టు -విజయవాడకు రెబల్ ఎంపీ తరలింపు -వైసీపీ గప్‌చుప్ -బూమరాంగ్?
దాదాపు రెండేళ్లుగా రాష్ట్రానికి దూరంగా ఉంటోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మళ్లీ జైలుకు పంపేదాకా ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టబోనని శపథం చేసినప్పటికీ శుక్రవారం నాటి సంచలన పరిణామాలతో ఆయన అనివార్యంగానైనా ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. జగన్ సర్కారు ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు ఇవాళ ఎంపీ రఘురామను హైదరాబాద్ లో అరెస్టు చేశారు. అయితే, ఇంకొద్ది గంటల్లో జగన్ బెయిల్ రద్దు అంశం విచారణకు రానుండటం, ఏడాదిలోపు శిక్ష పడే అవకాశాలున్న కేసుల్లో అరెస్టులు వద్దని సుప్రీంకోర్టు ఆదేశించిన దరిమిలా జగన్ సర్కారు నిర్ణయం బూమరాంగ్ అవుతుందా? అనే చర్చ జరుగుతోంది..
బంజరు భూమిలో బంగారం: ఏపీ మహిళా రైతు రమకు ప్రధాని మోదీ ప్రశంసలు - PM Kisan రూ.19 వేల కోట్లు విడుదల

విజయవాడకు రఘురామ..
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ఆయనపై 124ఏ, 153ఏ, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు రఘురామ భంగం కలిగించారని సీఐడీ అభియోగం మోపింది. ఎంపీ భార్య రమాదేవి పేరిట నోటీసులు ఇచ్చింది. అరెస్టు అనంతరం ఎంపీ రఘురామను పోలీసులు విజయవాడ తరలిస్తున్నారు. సరిగ్గా పుట్టిన రోజు నాడే రఘురామను ఏపీ పోలీసులు అరెస్టు చేశారని ఆయన కొడుకు భరత్ తెలిపారు. బైపాస్ సర్జరీ చేయిచుకున్న రఘురామను కరోనా సమయంలో అకస్మాత్తుగా బలవంతంగా అరెస్టు చేయడం, లాయర్ తో మాట్లాడే అవకాశం కల్పించకపోవడం దారుణమని భరత్ వాపోయారు. కాగా,
viral video: ఆ గుండె ఆగింది -కరోనాతో 'లవ్ యూ జిందగీ' యువతి మృతి -జీవితం అన్యాయం చేసిందన్న సోనూ సూద్

సీజేఐ రమణ ఆదేశాలు అలా..
ఏపీ సర్కారు ప్రతిష్టకు భంగం కలిగించినందుకు అరెస్టు అన్నారే తప్ప కచ్చితంగా ఏ జిల్లాలో, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరి ఫిర్యాదు మేరకు ఎంపీ రఘురామను అరెస్టు చేసిన విషయాన్ని సీఐడీ వర్గాలు ఇంకా స్పష్టం చేయాల్సి ఉంది. సొంత పార్టీపై తిరుగుబావుటా ఎగరేసిన రఘురామపై నర్సాపురం లోక్‌సభ స్థానం పరిధిలోనే 20కి పైగా కేసులు నమోదయ్యాయి. భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, తణుకు ఎమ్మెల్యేలతో పాటు మంత్రి రంగనాథ రాజు అనుచరులు గతంలో రఘురామకృష్ణ రాజుపై ఫిర్యాదులు చేశారు. కుల సంఘాల నాయకుల ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లాలో వివిధ పీఎస్‌లలో కేసులు నమోదు చేశారు. అరెస్టు భయంతో ఎంపీ పలుమార్లు నర్సాపురం పర్యటన వాయిదా వేసుకున్నారు. కాగా, ప్రస్తుత కరోనా విలయకాలంలో జైళ్లలో రద్దీని నివారించడంతోపాటు వైరస్ వ్యాప్తిని అడ్డుకునే ఉద్దేశంతో అరెస్టులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ''ఏడాదిలోపు శిక్షలు పడే అవకాశాలున్న ఏ కేసుల్లోనూ నిందితులను హుటాహుటిన అరెస్టు చేయరాదు. అత్యవసరం అయితేతప్ప అదుపులోకి తీసుకోరాదు'' అని సీజేఐ రమణ బెంచ్ గతవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ రఘురామపై నమోదైన వాటిలో తీవ్రమైన చార్జిలున్న కేసులేవీ లేకపోవడం సుప్రీం ఆదేశాలను ధిక్కరించినట్లవుతుందా, లేదా అనేది త్వరలో తేలాల్సి ఉంది. అదీగాక..
Recommended Video

జగన్ బెయిల్ రద్దు వేళ అరెస్టు..
క్విడ్ ప్రోకో వ్యవహారాలకు సంబంధించి 11 చార్జిషీట్లలో ఏ1గా ఉన్న వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని కేసులను నీరుగారుస్తున్నారని, సహ నిందితులకు ప్రభుత్వ, పార్టీ పరమైన పదవులు కట్టబెడుతూ, సీబీఐ అధికారులకు ఖరీదైన గిఫ్టులు ఇస్తూ, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నందున వెంటనే బెయిల్ రద్దు చేసి, కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ రెబల్ ఎంపీ రఘురామ హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే నోటీసులు అందుకున్న సీఎం జగన్, సీబీఐలు.. కౌంటర్ దాఖలుకు సమయం కోరారు. ఆ గడువు ఈనెల 17తో ముగియనుంది. అంటే, ఇంకొద్ది రోజుల్లో జగన్ బెయిల్ రద్దు అంశం మరోసారి విచారణకు రానుండగా, పిటిషనర్ రఘురామను జగన్ సర్కారు అరెస్టు చేయడం కీలకంగా మారింది. ఈ పరిణామంపై సీబీఐ కోర్టు ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. ఇదిలా ఉంటే, ఎంపీ రఘురామ అరెస్టుపై వైసీపీ శ్రేణులు ప్రస్తుతానికి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లుగా గప్ చుప్ అయ్యాయి..