సీఐడీ పోలీసుల ప్రతాపం వారిపైనా... పోలీసుల తీరుపైనా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలను సిఐడి పోలీసులు టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన టిడిపి మహిళా నేత గౌతు శిరీష కు సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేసి ఆమెను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని అభియోగంతో ఆమెను సిఐడి పోలీసులు టార్గెట్ చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పోస్టులపై సిఐడి పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహం పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
గౌతు శిరీష కుటుంబాన్ని అణచివేయడానికి సిఐడి పోలీసులు టార్గెట్ చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. చారిత్రక నేపథ్యం ఉన్న కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బీసీ మహిళకు ఎటువంటి గౌరవిస్తున్నారు అనేది శిరీష మీద కేసులు పెట్టడాన్ని బట్టి తెలుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగ నడుస్తోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు.

ప్రజా సమస్యలపై గొంతు విప్పాలని ప్రయత్నం చేస్తున్న వారిని అరెస్టు చేయాలని చూస్తున్నారని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ప్రశ్నించే గొంతు నొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. పెద్ద పెద్ద కేసులపై దృష్టి సారించాల్సిన ఏపీ పోలీసులు, సిఐడి పోలీసులు పెద్ద కేసులను ఛేదించడం మానేసి, చిన్నచిన్న సమస్యలపై దృష్టి సారించడాన్ని రామ్మోహన్ నాయుడు తప్పుబట్టారు. సోషల్ మీడియా పోస్టులపై పడి శాంతి భద్రతలను గాలికొదిలేశారని మండిపడ్డారు.
రూల్స్ కి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోలీసులు తప్పుడు కార్యక్రమాలకు సహకరిస్తున్నారని రామ్మోహన్ నాయుడు విమర్శలు గుప్పించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్న రామ్మోహన్ నాయుడు, ప్రజల కోసం పోలీసులు పని చేయడం లేదని టీడీపీ నేతలను అణచివేయడానికి మాత్రమే పనిచేస్తున్నారు అంటూ విమర్శించారు. ఏపీ ప్రభుత్వ పరిపాలన తీరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు ఎవరూ హర్షించటం లేదని తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తేల్చిచెప్పారు












Click it and Unblock the Notifications