అశోక్ గజపతి ధర్మకర్తనా .. అధర్మకర్తనా? ఆ ఆస్తులపై బహిరంగ చర్చకు సాయిరెడ్డి సవాల్ !!
టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పై వైసీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా అశోక్ గజపతి రాజు ధర్మకర్తనా .. అధర్మకర్తనా అంటూ టార్గెట్ చేసిన విజయసాయి రెడ్డి మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం ఆస్తుల దుర్వినియోగంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ఎక్కడ డిబేట్ పెట్టినా తాను రావడానికి సిద్ధంగా ఉన్నానని, నువ్వు సిద్ధమైతే రా అంటూ ఛాలెంజ్ చేశారు విజయసాయిరెడ్డి.

8 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తి పరాధీనం పాలైతే ఏం చేస్తున్నారు ?
దేవుడి ఆస్తులు కొల్లగొట్టడం లో అశోక్ గజపతిరాజు పాత్రపై అనుమానాలను వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి ఈరోజు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న తర్వాత అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మొదటి నుండి మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేస్తున్న సాయి రెడ్డి ఎనిమిది వందల నలభై ఎకరాల దేవస్థానం భూమి గత ప్రభుత్వ హయాంలో అన్యాక్రాంతమైనదని మండిపడ్డారు. దేవస్థానం భూములు అన్యాక్రాంతం అవుతుంటే ధర్మ కర్తలు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. 8 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తి పరాధీనం పాలైతే ఏం చేస్తున్నారని నిలదీశారు. ధర్మకర్తలు ధర్మానికి కట్టుబడి సంప్రదాయాలను కొనసాగించాలని స్పష్టం చేశారు.

తప్పు చేయకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లారు?
అశోక్ గజపతిరాజు బయటకు నీతులు చెబుతున్నాడని లోపల కుట్రలు చేస్తున్నారని విజయసాయి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ అశోక్ గజపతిరాజు ధర్మకర్త నా, లేకా అధర్మ కర్తనా అంటూ విరుచుకుపడిన సాయి రెడ్డి మాన్సాస్ ట్రస్ట్ లో అక్రమాలకు అశోక్ గజపతినే బాధ్యుడని విమర్శించారు. తప్పు చేయకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు విజయసాయిరెడ్డి. గత ప్రభుత్వ హయాంలో సింహగిరిపై అనేక అక్రమాలు జరిగాయని విమర్శించారు. త్వరలోనే పంచ గ్రామాల భూ సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

పంచ గ్రామాల భూ సమస్యపై న్యాయపరంగా కృషి చేస్తాం
మహిళలపై అశోక్ గజపతి రాజుకు ఏమాత్రం గౌరవం ఉన్నా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పురుషులతో సమానంగా మహిళలకు అవకాశం కల్పించాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. సంచయిత గజపతిరాజుకు ట్రస్ట్ చైర్మన్ గా కొనసాగనివ్వాలని అభిప్రాయపడ్డారు . అశోక్ గజపతిరాజు నిజాయితీపరుడు అయితే కోర్టుకెళ్లి చైర్మన్ పదవి తెచ్చుకోవడం దేనికని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. పంచ గ్రామాల సమస్య న్యాయ స్థానంలో ఉండడం వల్ల న్యాయ పరిధిలో త్వరగా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు.

మాన్సాస్ ట్రస్ట్ పై అశోక్ గజపతి, చంద్రబాబును టార్గెట్ చేస్తున్న సాయిరెడ్డి
ఇప్పటికే మాన్సాస్ ట్రస్ట్ లో చంద్రబాబు హయాంలో భూముల అమ్మకం జరిగిందని , అశోక్ గజపతిరాజు చంద్రబాబు కలిసి మాన్సాస్ ట్రస్టులో అక్రమాలకు పాల్పడ్డారని విజయ సాయి రెడ్డి అనేకమార్లు అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేశారు .మాన్సాస్ ట్రస్ట్ లో జరిగిన అక్రమాలు బయటపెడతామని పేర్కొన్నారు. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ఆది నుంచి విజయ సాయి రెడ్డి అశోక్ గజపతిరాజు చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా సంచైత గజపతిరాజు తొలగించిన నాటినుండి మాటల యుద్ధం మరింత పెంచి అశోక్ గజపతిరాజు పై దాడి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications