ఆటలో ఓడిన పిల్లల్లా పచ్చ బ్యాచ్ పరిస్థితి; కృష్ణా కరకట్ట అక్రమ నివాసి : సాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిత్యం టిడిపి నేతలను, చంద్రబాబును టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఇక తాజాగా మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం భూముల వ్యవహారంలో అక్రమాలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని దర్యాప్తు నివేదికలు త్వరలోనే అందుతాయని, అక్రమాలపై ఎవరిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పిన విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగానూ టిడిపి నాయకులను టార్గెట్ చేసి విమర్శలు చేశారు.

ఆటలో ఓడిన పిల్లలు బొమ్మలను విసిరేస్తుంటారు ..అలాగే టీడీపీ నేతలు కూడా
ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసిన విజయసాయి రెడ్డి ఆటలో ఓడిన పిల్లలు బొమ్మలను విసిరేస్తుంటారని, పచ్చ బ్యాచ్ పరిస్థితి అచ్చం అలాగే ఉంది అంటూ సెటైర్లు వేశారు. నిమ్మగడ్డను నమ్మి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు వద్దన్నా కరోనా టైమ్ లో జరిపించారని పేర్కొన్న విజయసాయిరెడ్డి, తిరుపతిలో తల బొప్పి కట్టింది అని జగన్ గారికి ప్రజాభిమానం పెరుగుతుండటం తట్టుకోలేక పచ్చ బ్యాచ్ బట్టలు చింపుకుంటున్నారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

చంద్రబాబు అండ్ కో గిలగిలా తన్నుకుంటోంది
ఏపీ సర్కార్ పై టిడిపి నేతలు ఏ ఆటలోనూ గెలవలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.అంతేకాదు అమరావతి ఆశలు పటాపంచలైన నాటి నుంచి చంద్రబాబు అండ్ కో గిలగిలా తన్నుకుంటోంది. 5 లక్షల కోట్లు మూట కట్టుకోవచ్చని స్కెచ్ వేస్తే పెట్టుబడి ఇరుక్కు పోయిందని గంగవెర్రులెత్తుతున్నారు. బాబు రాజకీయం అంతా డబ్బు వెదజల్లడమే. అధికారం పోయింది, వస్తుందనుకున్న సంపద హుళక్కి అయ్యింది అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబును టిడిపి నాయకులను టార్గెట్ చేసి విమర్శించారు.

కరకట్ట రోడ్డు విస్తరణ చెయ్యాలని అక్రమ నివాసికి ఎందుకు అనిపించలేదో ?
ఇక తాజాగా సైరా పంచ్ వేసిన విజయసాయిరెడ్డి కరకట్ట అక్రమ కట్టడంలో ఉండాలనుకున్నావే కానీ, ప్రజల సౌకర్యం కోసం కరకట్ట రోడ్డు విస్తరించాలని అక్రమ నివాసికి ఎందుకు అనిపించలేదు? అంటూ చంద్రబాబును సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈరోజు కృష్ణా నది కరకట్ట విస్తరణ పనులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించిన నేపథ్యంలో విజయ సాయిరెడ్డి అక్రమనివాసి అంటూ తాజా ప్రశ్నను చంద్రబాబుకు సంధించారు.












Click it and Unblock the Notifications