వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హామీ విస్మరించిన బాబు: ఎమ్మార్పీఎస్ ‘కురుక్షేత్ర’ సభపై ఉక్కుపాదం

ఇంటికి పెద్ద మాదిగనవుతా.. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా.. అని హామీలిచ్చారు చంద్రబాబు.. అదీ 2014 ఎన్నికలకు ముందు తెలంగాణలో జరిగిన ‘మీ కోసం’ యాత్రలో ఇచ్చిన వాగ్దానం.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఇంటికి పెద్ద మాదిగనవుతా.. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా.. అని హామీలిచ్చారు చంద్రబాబు.. అదీ 2014 ఎన్నికలకు ముందు తెలంగాణలో జరిగిన 'మీ కోసం' యాత్రలో ఇచ్చిన వాగ్దానం. 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఇక్కడ ఒక విశేషం కూడా ఉంది. అడిగినవారికి, అడుగని వారికి చేతికి ఎముకే లేదన్నట్లు ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపించారు చంద్రబాబు..

కష్టానికి తగిన ఫలం అధికారం చే'జిక్కింది'.. ఇంకేం ప్రజలతో పనైపోయింది.. హామీలు నమ్మి ఓట్లేసిన సామాన్యులు నట్టేట మునిగినా అవసరం లేదు. అటువంటి వారిలో మాదిగలు ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్లలో ఎ,బీ,సీ,డీలుగా వర్గీకరణకు మద్దతునిస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. అసలు ఏ,బీ,సీ,డీ వర్గీకరణ ఉద్యమానికి సారథ్యం వహించిన మందక్రుష్ణను ప్రోత్సహించిందే చంద్రబాబు నాయుడు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ సంగతి తెలియని కొందరు ఏపీ మంత్రులు మందక్రుష్ణపై విమర్శల పర్వం సాగిస్తున్నారు.
తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు వర్గీకరణ కోసం రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానాలు ఆమోదించారు.

ప్రధాని మోదీతో సంప్రదింపులకు ఢిల్లీకి అఖిలపక్ష కమిటీని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ చివరి క్షణంలో కొందరు నేతల తెరవెనుక లాబీయింగ్ వల్ల ప్రధానితో సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అఖిలపక్ష భేటీ వాయిదా పడింది. వర్గీకరణ విషయమై ఏపీ సీఎం చంద్రబాబు చేసిందేమీ లేదు. పైపైచ్చు వర్గీకరణ కోసం రాష్ట్ర రాజధాని అమరావతికి సమీపాన 'కురుక్షేత్ర' సభ నిర్వహిస్తామన్న ఎమ్మార్పీఎస్ నిర్ణయాన్ని పోలీసు బలంతో అడ్డుకున్న నేపథ్యం చంద్రబాబు నాయుడుది. ఓడ దాటే వరకు ఓడమల్లయ్య.. తర్వాత బోడి మల్లయ్య అన్న చందంగా అవసరం ఉన్నంతసేపు ఒకలా.. తర్వాత మరోలా వ్యవహరించడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఎక్కడికక్కడ దిగ్బంధం

ఎక్కడికక్కడ దిగ్బంధం

శుక్రవారం గుంటూరులోని నాగార్జున యూనివర్శిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ నిర్వహించ తలపెట్టిన ‘కురుక్షేత్ర' సభ రణరంగంగా మారింది. యూనివర్సిటీ పొలాల చుట్టూ నక్కి ఉన్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా హైవేపైకి వచ్చారు. రోడ్లపై బైఠాయించారు. బస్సులపైకి రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల కొద్దీ ఆగిన వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళనకారులు అంతటితో ఆగలేదు. పోలీసు వాహనానికి నిప్పు పెట్టడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీంతో ఆందోళన హింసాత్మకంగా మారింది. ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్‌ శుక్రవారం గుంటూరు సమీపంలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో ‘కురుక్షేత్ర' సభకు నిర్వహించాలని భావించింది. ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గురువారం రాత్రి నుంచే గుంటూరుకు దారి తీసే మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఇలా ఆందోళనకారులు

మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఇలా ఆందోళనకారులు

కురుక్షేత్ర సభ వేదికను చేరుకునేందుకు ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మంగళగిరి చుట్టుపక్కల గ్రామాల వారు జాతీయ రహదారికి అటూ ఇటు ఉన్న పొలాల్లో దాక్కున్నారు. శుక్రవారం 3 గంటల సమయంలో ఆకస్మికంగా గుంపులు గుంపులుగా హైవేపైకి వచ్చారు. కాజ టోల్‌ గేట్‌ వద్ద కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. టోల్‌ప్లాజా క్యాబిన్ల అద్దాలు పగలగొట్టారు. దీంతో అటూ ఇటూ కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి.

వాడపల్లి వద్ద కృష్ణా నది వంతెనపై ధర్నా

వాడపల్లి వద్ద కృష్ణా నది వంతెనపై ధర్నా

నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని ఒక ప్రార్థన మందిరంలో పెద్దసంఖ్యలో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు గుమికూడారు. వారంతా కంతేరు అడ్డరోడ్డు ద్వారా సభా ప్రాంగణం వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించారు. పోలీసు బందోబస్తు నేపథ్యంలో... ఐజీఎం వైపు కదిలారు. అక్కడే ఉన్న ఒక పోలీసు వ్యాన్‌ నుంచి ఇంధనం తీసి, దానిపై పోసి నిప్పంటించారు. కురుక్షేత్ర సభకు నల్లగొండ, సూర్యాపేట, వరంగల్‌ వంటి తెలంగాణ జిల్లాల నుంచి కూడా భారీగా ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు తరలి వచ్చారు. అయితే... వీరిని ఏపీ పోలీసులు సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు. అద్దంకి-నార్కట్‌పల్లి రోడ్డులో వాడపల్లి వద్ద కృష్ణా నది వంతెనపై కార్యకర్తలు రెండుగంటలపాటు ధర్నా చేశారు. ఇక... హైదరాబాద్‌-విజయవాడ రహదారిలో సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. హైవేపై ధర్నాతో గరికపాడు చెక్‌పోస్టు నుంచి నల్లబండగూడెం వరకు సుమారు పది కిలోమీటర్లపాటు వాహనాలు నిలిచిపోయాయి.

హైదరాబాద్ లో ఇలా ఆందోళన

హైదరాబాద్ లో ఇలా ఆందోళన

ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసు అధికారులతో మాట్లాడి ట్రాఫిక్‌ను మళ్లించేలా చూశారు. బులుసుపాడు వద్ద రహదారిపై నిలిపి ఉన్న బస్సులపై ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. సుమారు పది బస్సుల అద్దాలు పగలగొట్టారు. ఒక కార్యకర్త ఒంటిపై కిరోసిన్‌ పోసుకున్నాడు. ఇదే క్రమంలో కొందరు కార్యకర్తలు ఒక గుడిసెకు నిప్పంటించారు. రాత్రి 7 గంటల సమయానికి మొత్తం పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు... అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో వర్గీకరణ చేస్తామన్న బీజేపీ ఇప్పటికీ బిల్లు పెట్టలేదని హైదరాబాద్‌లో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. అటు ఢిల్లీలోనూ జంతర్‌మంతర్‌ వద్ద ఆరేజే ప్రకాశ్‌ మాదిగ నేతృత్వంలో 50 మంది ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు ధర్నా చేశారు.

కింది స్థాయి అధికారులపై డీజీపీ సీరియస్

కింది స్థాయి అధికారులపై డీజీపీ సీరియస్

‘శాంతి భద్రతల దృష్ట్యా కురుక్షేత్ర సభకు అది అనువైన ప్రదేశం కాదని చెప్పాం. అయినా చట్టాన్ని ధిక్కరించి రోడ్డు పైకి వచ్చారు. ఎవరు చట్టాన్ని ఉల్లంఘిచినా చర్యలు తప్పవు'' అని డీజీపీ సాంబశివరావు తెలిపారు. హైకోర్టు తమకు అనుమతిచ్చిందని అసలు విషయాన్ని వక్రీకరిస్తున్నారని చెప్పారు. మరోవైపు... ఖాజా టోల్‌గేట్‌ వద్దకు రెండు రోజుల ముందే ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు వచ్చినా పసిగట్టి అదుపులోకి తీసుకోలేక పోవడంపై డీజీపీ కిందిస్థాయి అధికారులపై సీరియస్‌ అయినట్లు తెలిసింది. కాగా, కురుక్షేత్ర సభ నేపథ్యంలో వెలగపూడి సచివాలయం వద్ద భద్రత భారీగా పెంచారు.

ఏపీ సీఎం బాబుపై మందకృష్ణ ఇలా

ఏపీ సీఎం బాబుపై మందకృష్ణ ఇలా

దాదాపు రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శుక్రవారం రాత్రి 10.30 గంటలకు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. పోలీసుల అదుపులో ఉండి అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న వెంకట రాములును పరామర్శించారు. అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని మంద కృష్ణను తమ అదుపులోకి తీసుకున్నారు. ఆయనను వాహనంలో తీసుకెళ్లి... ఏపీ సరిహద్దులు దాటించి వదిలేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ... ‘‘టీడీపీకి ఎమ్మార్పీఎస్‌ పూర్తి మద్దతు ప్రకటించింది. ఏపీలో ఓట్లు వేసి గెలిపించాం. తెలంగాణలో ముందుండి నడిపించాం. నేను అభిమానించే నేతల్లో చంద్రబాబు ఒకరు. వర్గీకరణకు మద్దతుగా నిలిచిన ఆయన ఇలా చేస్తారని ఊహించలేదు. కురుక్షేత్ర సభ ఆరంభం మాత్రమే. త్వరలో మా తడాఖా ఏమిటో చూపిస్తాం'' అని హెచ్చరించారు.

మందక్రుష్ణపై ఏపీ మంత్రి ఇలా

మందక్రుష్ణపై ఏపీ మంత్రి ఇలా

2001లో తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైంది. కానీ 1995 నుంచే మందక్రుష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ వర్గీకరణ కోసం వివిధ రూపాల్లో ఆందోళన సాగిస్తున్నారు. కానీ ఇటీవలే ఏపీ క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న రాష్ట్ర మంత్రి జవహార్.. ముందు తెలంగాణ సంగతి తేల్చుకోకుండా మందక్రుష్ణకు ఏపీలో ఏం పని అని నిలదీశారు. ఎస్సీ వర్గీకరణకంటే తెలంగాణ ఏర్పాటైన ముఖ్యమని ప్రకటించిన మందక్రుష్ణ.. ఏపీకి వచ్చే అర్హత లేదని కూడా తేల్చేశారు. తెలంగాణలో దళితుల సమస్యలపై , దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్ పై మందకృష్ణ ఎందుకు పోరాటం చేయడం లేదని ఏపీ మంత్రి జవహర్‌ ప్రశ్నించారు. వర్గీకరణ అంశం తమ చేతుల్లో లేదని , చట్టప్రకారం దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే నిజమైతే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. టీడీపీకి మిత్రపక్షమేగా.. ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులతో సంప్రదించి వర్గీకరణకు అనుకూలంగా చట్టం చేయించవచ్చుగా? అని రాజకీయ విశ్లేషకులు నిలదీస్తున్నారు. అందునా అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని బీజేపీ కూడా హామీలు గుప్పించింది.

English summary
MRPS Agitation failed in Guntur. AP Police denied permmission for MRPS meeting 'Kurukshtra' at Guntur's Nagarjuna University. AP police had taken precautionary actions from the Thurs day night and arranged barricades on national highways.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X