ముద్రగడపై జగన్ ప్లాన్: చిరంజీవిని దాసరి కార్నర్ చేస్తున్నారా?
విజయవాడ: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో కాపు నేతలు దాసరి నారాయణ రావు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, పళ్లం రాజు తదితర కాపు నేతలు ఇటీవల వరుసగా మీడియా ముందుకు వచ్చారు. అయితే, చిరంజీవికి అంతగా ప్రాధాన్యత లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ముద్రగడ దీక్షను కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారు సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు చెందిన కాపు నేతలు ఒక్కటయ్యారు. చంద్రబాబు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.
ఈ కాపు నేతలలో దాసరి, చిరంజీవిలి ప్రధానంగా కనిపిస్తున్నారు. వారిద్దరి మధ్య సఖ్యత లేదనే వాదనలు న్న విషయం తెలిసిందే. తాజాగా, ముద్రగడ లేదా చంద్రబాబును వారిని కలిపారు. కానీ, కాపు ఉద్యమం విషయంలోను వారి మధ్య అంత బాగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

ముద్రగడ దీక్ష నేపథ్యంలో కాపు నేతలు రెండుమూడుసార్లు భేటీ అయ్యారు. ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా భేటీ అయిన వారిలో దాసరి, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పళ్లం రాజు, సీ రామచంద్రయ్య తదితరులు ఉన్నారు.
ఇలా భేటీ అవుతున్న వారిలో చిరంజీవి, సీ రామచంద్రయ్య మినహా మిగతా వారు దాసరి వర్గంగా చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే పళ్లం రాజు మినహా మిగతా వైసిపికి లేదా జగన్‌కు అనుకూలురు అని అంటున్నారు.
అంబటి, బొత్సలు వైసిపి నేతలు. దాసరి నారాయణ రావు ఎలాగు జగన్‌కు అనుకూలంగా ఉన్నారు. కాపు నేతల సమావేశంలో దాసరిదే పైచేయిగా ఉందని చెబుతున్నారు. పళ్లం రాజు కూడా దాసరి వర్గంగా చెబుతున్నారు. తద్వారా చిరంజీవి, ఆయన వర్గం నేత రామచంద్రయ్యలకు అంత ప్రాధాన్యత లేదనే పుకార్లు వినిపిస్తున్నాయి. కాపు అంశాన్ని వ్యూహాత్మకంగా జగన్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారా అనే చర్చ సాగుతోంది.
మరో విషయం ఏమంటే, ముద్రగడ పద్మనాభం దీక్ష, ఆరోగ్య పరిస్థితి గురించి ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుందని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. ముద్రగడ దీక్ష పరిస్థితి ఏమిటి, ఆరోగ్య పరిస్థితి గురించి తెలియకుండా ఏం చేయాలో కాపు నేతలకు అర్థం కావడం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications