పోలీసులపై ముద్రగడ సీరియస్, మేమున్నాం.. కాపులకు మంత్రుల ఫోన్ సందేశాలు!
రాజమహేంద్రవరం: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆదివారం నాడు ఉదయం పోలీసుల పైన సీరియస్ అయ్యారు. ముద్రగడ దీక్ష చేస్తున్న హాలులోకి పోలీసులు వచ్చారు. దీంతో వారు అక్కడి నుంచి బయటకు వెళ్లాలని ముద్రగడ సూచించారు.
వారు వెళ్లకపోవడంతో... మీరు ఇక్కడే ఉంటే నేను నా గదిలోకి వెళ్లిపోతానని, మీరు హాల్లో కూర్చుంటే అదే పని చేస్తానని సీరియస్ అయ్యారు. ఆయన తన గదిలోకి వెళ్లి అరగంట పాటు ఉన్నారు. ఆ తర్వాత పోలీసులు హాలు నుంచి వెళ్లిపోయారు. ముద్రగడ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారని తెలిసి కిర్లంపూడి ప్రజలు తరలి వచ్చారు.

అంతకుముందు, జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్‌లు ముద్రగడ ఇంటిలోకి వెళ్లారు. వారి వెంట కొంతమంది పోలీసులు కూడా తన ఇంటిలోకి ప్రవేశించడంతో ముద్రగడ మండిపడ్డారు. ఎక్కడ తన దీక్షను భగ్నం చేస్తారోనన్న ఆందోళనతో తన గదిలోకి వెళ్లిన ఆయన తలుపులేసేసుకున్నారు. దీంతో అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చారంటూ జాయింట్ కలెక్టర్, ఎస్సీలతో ముద్రగడ అనుచరులు వాగ్వాదానికి దిగారు.
ముద్రగడ ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు రూ.2 లక్షల కోట్లు ఎలా సంపాదించారో చెబితే తాము తమ డిమాండ్లను పూర్తిగా పక్కన పెడతామని, మీరు సంపాదించినట్లుగా మేం సంపాదిస్తామని ముద్రగడ అన్నారు.

తనకు కాదని, చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉంటేనే ఇచ్చిన హామీలు గుర్తుకు వస్తాయన్నారు. విలేకరులతో మాట్లాడిన అనంతరం ఆయన మళ్లీ ఇంటిలోకి వెళ్లిపోయారు.
కాపులకు మంత్రుల పేరుతో సెల్ ఫోన్ ప్రయత్నాలు
ముద్రగడ దీక్ష నేపథ్యంలో మంత్రుల పేరుతో కాపులకు ఫోన్ సందేశాలు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఏపీ కేబినెట్లోని డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజం పేరిట కాపులకు సెల్‌ఫోన్ సందేశాలు వస్తున్నాయి.

'కాపు సోదరులారా ఆలోచించండి. ఆందోళన చెందవద్దు. మీ సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది' అంటూ కాపుల సెల్‌ఫోన్లలో సందేశాలు రావడం చర్చకు తెరలేపాయి. కాపులకు రిజర్వేషన్లతో పాటు వచ్చే ఏడాది కాపు కార్పొరేషన్ కు రూ.1,000 కోట్ల నిధులు విడుదల చేయనున్నామని సదరు సందేశాల్లో ఆ ముగ్గురు నేతలు కాపులకు నచ్చజెబుతున్నారు.

ఇక రాష్ట్రం ఆర్థిక చిక్కుల్లో ఉన్నా కాపుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని ఆ సందేశాల్లో ఉంటున్నాయి.












Click it and Unblock the Notifications