Mudragada Padmanabham: ముద్రగడ అనూహ్య నిర్ణయం- తాడేపల్లికి ర్యాలీ రద్దు..!
కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వేళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సిద్దమైన ముద్రగడ పద్మనాభం.. చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అభిమానులకు ఓ లేఖ రాశారు. తాడేపల్లికి వెళ్లేందుకు ఆయన ప్లాన్ చేసుకున్న ర్యాలీని రద్దు చేసుకున్నారు. అదే సమయంలో అభిమానులకు రాసిన లేఖలో పలు విషయాల్ని ప్రస్తావించారు.

వాస్తవానికి ఈ నెల 14న అంటే గురువారం తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని ముద్రగడ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన స్వగ్రామం కిర్లంపూడి నుంచి తాడేపల్లి వెళ్లేందుకు రూట్ మ్యాప్ కూడా ప్రకటించారు. అయితే ఈ ర్యాలీకి భారీ ఎత్తున స్పందన రావడంతో దీన్ని రద్దు చేసుకోక తప్పలేదంటూ ముద్రగడ ఇవాళ అభిమానులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఊహించిన దాని కంటే భారీ స్దాయిలో స్పందన రావడం మీదట వారికి సెక్యూరిటీ ఇబ్బంది వల్ల ఎక్కువ మంది వస్తే కూర్చోవడానికి కాదని, నిలబడటానికి కూడా స్ధలం సరిపోదని, వచ్చిన ప్రతీ వారినీ చెక్ చేయడం చాలా ఇబ్బందని చెప్పడం వల్ల తాడేపల్లికి మనమందరం వెళ్లే కార్యక్రమం రద్దు చేసుకున్నానంటూ ముద్రగడ పేర్కొన్నారు. మిమ్మల్ని నిరుత్సాహపర్చినందుకు మరొకసారి క్షమాపణ కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 15 లేదా 16తేదీల్లో నేనొక్కడినే తాడేపల్లికి వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు ముద్రగడ పద్మనాభం వెల్లడించారు. ఇందుకు మీ అందరి ఆశీస్సులు ఉండాలంటూ అభిమానుల్ని కోరారు. ఈ మేరకు అపాయింట్ మెంట్ ఖరారు కావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications