కంటతడి పెట్టిన ముద్రగడ, తుని ఘటన.. భూమన కరుణాకర్ రెడ్డి ఆర్థిక సాయం!
విజయవాడ: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం నాడు కంటతడి పెట్టారు. తన పైన జరుగుతున్న ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టారు. తునిలో కొందరు ఆందోళనకారులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.
దీనిపై తన మీద విష ప్రచారం జరుగుతోందని ఆయన కంటతడి పెట్టారు. ఆదివారం కొందరు ఆందోళనకారులు కనిపించిన రైలు, బస్సులపై దాడికి దిగారు. అడ్డుకున్న పోలీసులపైనా విరుచుకుపడ్డారు. కాపు గర్జనకు భద్రత కల్పించేందుకు వచ్చిన పోలీసులతో పాటు కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులూ గాయపడ్డారు.
దీంతో ప్రభుత్వం వేగంగా స్పందించింది. వాస్తవాలను మరచి ముద్రగడ యువతలో ఉద్రేకాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించింది. అల్లర్లకు కారణమైన వారిలో ఏ ఒక్కరిని కూడా వదిలేది లేదని తేల్చి చెప్పింది.

ఈ క్రమంలో జరిగిన ఘోరంపై ఆరా తీసిన ముద్రగడ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కళ్ల వెంట నీళ్లు సుడులు తిరిగాయి. ఎవరో కావాలనే ఈ హింసను ఎగదోశారన్నారు. హింసకు ప్రభుత్వానిదే బాధ్యత అని ఆరోపించారు. దాడులను ప్రోత్సహించే సంస్కృతి తనది కాదన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పైన చినరాజప్ప నిప్పులు
రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తేట్టుగా చూడాలని ఎదురుచూస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ... కాపు గర్జన సభను ఉపయోగించుకుందని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సోమవారం ఆరోపించారు. వైసిపి భూమన కరుణాకర్ రెడ్డి ఈ సభకు ఆర్థిక సాయం చేశాడని తమ వద్ద సాక్ష్యాలున్నాయన్నారు.
కడప జిల్లా నుంచి వచ్చిన రౌడీమూకల కారణంగానే అల్లర్లు జరిగాయన్నారు. అల్లర్ల వెనుక వైసిపి పాత్ర ఉందని, సదస్సుకు వచ్చిన ప్రజలను ముద్రగడ రెచ్చగొట్టాడన్నారు. ముద్రగడ పచ్చి అబద్ధాల కోరని, ఆయన మాటలను కాపు వర్గం విశ్వసించరాదన్నారు.
కాపులకు ఇప్పటికే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పడిందని గుర్తు చేసిన ఆయన, కాపులను ఆదుకునేందుకు, వారిని బీసీల్లో కలిపేందుకు చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. కాపులను బీసీలలో చేరుస్తూ, ఇప్పటికిప్పుడు జీవో జారీ చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చినరాజప్ప అన్నారు.
అయితే, జీవో ఇచ్చినంత మాత్రాన కాపులు బీసీల్లో చేరిపోయి రిజర్వేషన్లు పొందుతారా? అని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయమై గతంలోనూ జీవో వచ్చిందని, అది కోర్టులో ఉన్న సమయంలో నిజానిజాలు మరచి మాట్లాడటం సరికాదని ముద్రగడను ఉద్దేశించి ఆయన అన్నారు.
జీవోలు నిలబడవని, అత్యంత క్లిష్టమైన ఈ అంశాన్ని సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని చినరాజప్ప తెలిపారు. ముద్రగడ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. హింసను తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications