నేనే మొదటి ముద్దాయిని: ముద్రగడ సంచలన ప్రకటన
విశాఖపట్నం: తూర్పు గోదావరి జిల్లా తుని కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలపై కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. తుని ఘటనల్లో తానే మొదటి ముద్దాయిని అని ఆయన అన్నారు. తుని ఘటనలకు సంబంధించిన కేసుల్లో తన తర్వాతే ఎవరైనా వస్తారని, అందువల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు శనివారనాడు ముద్రగడ విశాఖపట్నం జిల్లా కసింకోటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

కాపు గర్జనలో పాల్గొన్నవారిపై కాకుండా ఘటనలతో సంబంధం లేనివారిపై ప్రభుత్వం కేసులు పెడుతోందని ఆయన విమర్సించారు. తమది ఆకలి కేకే గానీ వినోదం కోసం చేసింది కాదని ఆయన అన్నారు. తుని ఐక్య గర్జనలో పాల్గొన్నవారు, దానికి సహకరించినవారు, రవాణా సదుపాయాలు కల్పించినవారి పేర్లతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిజిఎంలకు ఇప్పటికే తాను లేఖలు రాసినట్లు ఆయన తెలిపారు.
కాపు ఐక్య గర్జన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తునిలో జనవరి 31వ తేదీన హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా దగ్ధం చేశారు. దీంతో పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications