జగన్ పార్టీ ఖాళీకి గడువు మే: మంత్రుల మాట అదే...
గుంటూరు/ కాకినాడ: వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన మెజారిటీ శాసనసభ్యులను మే నాటికి తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే వ్యూహరచన అమలు చేస్తున్నట్లు మంత్రుల మాటలను బట్టి అర్థమవుతోంది. మేనాటికి వైయస్ జగన్ ప్రతిపక్ష హోదా కోల్పోతారని ఇద్దరు మంత్రులు గురువారంనాడు జోస్యం చెప్పారు.
నవ్యాంధ్ర రాజధాని భూ కుంభకోణం ఆరోపణలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఆధారాలు చూపిస్తే ఏ విచారణకైనా సిద్ధమేనని మంత్రి పుల్లారావు సవాల్‌విసిరారు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆయన గురువారం గుంటూరులో మీడియా సమావేశంలో ఆరోపించారు.
మే నాటికి జగన్ ప్రతిపక్ష స్థానం కోల్పోతారని ఆయన జోస్యం చెప్పారు. మే 30న రాజధాని ప్రాంతంలోని నేలపాడులో రైతులకు ఫ్లాట్ల పంపిణీ చేస్తామని తెలిపారు. కొండవీటివాగు ముంపునివారణపై జాతీయస్థాయి కమిటీ వేసి బాధితులకు న్యాయం చేస్తామని పుల్లారావు భరోసాఇచ్చారు.

ఇదిలావుంటే, ఏపీ రెండెంకెల వృద్ధిరేటు సాధించడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆర్థికమంత్రి యనమల మండిపడ్డారు. గురువారంనాడు మీడియా సమావేశంలో ఆయన జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జగన్ శాసనసభ పక్ష నేత పదవిని కోల్పోతారని యనమల జోస్యం చెప్పారు.
ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదు, జగనోక్రసీ భరించలేకే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని యనమల చెప్పుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం ఫిరాయింపుల కిందకు రాదని ఆయన తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications