మురళీమోహన్ అలా అనడం బాధించింది!: తెరాస ఎంపీ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన దురదృష్టకరమని రాజమండ్రి ఎంపీ, ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ అనగా... అలా అనడం బాధాకరమని తెరాస ఎంపీ జితెందర్ రెడ్డి మంగళవారం అన్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన పార్లమెంటు సభ్యులకు మంగళవారం ఏపీ భవన్‌లో ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయింది పరస్పరం అభివృద్ధి చెందేందుకే తప్ప ద్వేషించుకునేందుకు కాదన్నారు. 2 రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, రెండు రాష్ట్రాలకూ న్యాయం చేస్తామన్నారు. మురళీ మోహన్ మాట్లాడుతూ విభజన దురదృష్టకరమని, తెలుగు ప్రజలకు రెండు కళ్ల వంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలన్నారు.

ఆ తర్వాత మాట్లాడిన జితేందర్ రెడ్డి... విభజన దురదృష్టకరమని మురళీ మోహన్ అనటం బాధాకరమన్నారు. టిడిపి ఎంపీ రాయపాటి సాంబశివ రావు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోవటంతో తాము అన్నీ కోల్పోవాల్సి వచ్చిందని, ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ మిగల్లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏమిచ్చినా తెలంగాణకు కూడా ఇవ్వాలని కెసిఆర్ కోరడం మంచి పద్ధతి కాదన్నారు.
తెరాస ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చినా ఇరురాష్ట్రాల సీఎంలు, ఎంపీలు కూర్చుని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలన్నారు. కాగా, హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల మృతికి సంతాపంగా ఎంపీలు కొద్దిసేపు మౌనం పాటించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.












Click it and Unblock the Notifications