ఏపీ అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు కష్టపడుతున్నారు: ఎయిమ్స్ శంకుస్థాపనలో వెంకయ్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అబివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడుతున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ మంగళగిరిలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. 68 ఏళ్లలో మూడు కోట్ల మందికే బ్యాంకు ఖాతాలుంటే, ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక 19 కోట్ల మందికి ఖాతాలు తెరిపించారన్నారు.

ప్రపంచం మొత్తం మోడీవైపు చూస్తుంటే, దేశం చంద్రబాబు నాయుడువైపు చూస్తోందన్నారు. చిన్న చిన్న సమస్యలు అధిగమిస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదలతో ఏపీ కోసం ఒక్కొక్కటి సాధిస్తున్నారన్నారు.
ప్రపంచంలో ఆశాకిరణం ఏదైనా ఉందంటే అది భారత్ మాత్రమేనన్నారు. అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటే నష్టపోయేది సామాన్య ప్రజలేనన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లలో చర్చలు జరగకుండా అడ్డుకుంటే దేశానికి నష్టం జరుగుతోందన్నారు.
కాగా, మంగళగిరిలో ఎయిమ్స్ స్థల సేకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిని అభినందించారు. దేశ వ్యాప్తంగా ఆరోగ్య సేవల విస్తరణకు 18 నెలల కాలంలో 10 ఎయిమ్స్‌ల స్థాపనకు చర్యలు తీసుకున్నామని ముందుగా మాట్లాడిన కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు.
మంగళగిరిలో 193 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,618 కోట్ల వ్యయంతో మూడేళ్లలో ఎయిమ్స్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రతి ఎయిమ్స్‌లో 900 నుంచి వెయ్యి పడకలు ఉండేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. 70 వైద్య కళాశాలల్లో అధునాతన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
మధుమోహం, గుండె జబ్బులతో అధికశాతం మరణాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. క్యాన్సర్‌పై రెండు అధునాతన వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నామని, క్యాన్సర్ సంరక్షణ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. వైద్య రంగంలో కొత్త ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజు, రాష్ట్రమంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, ఎంపీలు గల్లా జయదేవ్, కంభంపాటి హరిబాబు, మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications