సమర్థులు లేరా: కెసిఆర్‌పై నాగం, ఎర్రబెల్లి ఫైర్
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగిన తీరుపై భారతీయ జనతా పార్టీ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ద్రోహులని అభివర్ణించిన తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావుకు.. ఇప్పుడు వాళ్లు దోస్తులు ఎలా అయ్యారని ఆయన ప్రశ్నించారు.
ఏనాడూ తెలంగాణ జెండా పట్టనివాళ్లు, జై తెలంగాణ అనని వాళ్లు బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారని నాగం జనార్ధన్ రెడ్డి నిలదీశారు. టిఆర్ఎస్‌లో మంత్రి పదవులు ఇవ్వడానికి సమర్థులైన ఎమ్మెల్యేలే లేరా అని ఆయన ప్రశ్నించారు.

ఇతర పార్టీల వారిని చేర్చుకుని, మంత్రి పదవులు ఇవ్వడం తెలంగాణ ప్రజలను అవమాన పర్చడమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ కెసిఆర్ వల్ల సాధ్యం కావని నాగం జనార్ధన్ రెడ్డి విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా మంత్రివర్గ విస్తరణపై మండిపడ్డారు. మంత్రివర్గ విస్తరణలో కూడా ఒక్క మహిళకూ స్థానం ఇవ్వకపోవడంపై ఆయన సిఎం కెసిఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications