ఝలక్: వైయస్ జగన్‌కు ఫ్యాక్స్‌లో నల్లపురెడ్డి రాజీనామా లేఖ
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌కు స్ధానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి నల్లపు రెడ్డి రాజీనామా చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ మేరకు తన రాజీనామా లేఖను ఫ్యాక్స్‌లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు పంపించారు. జిల్లాలో గత కొంతకాలంగా మేకపాటి, నల్లపురెడ్డి వర్గం మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలు నిజం కాదని వైసీపీ నేత నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ వివరణ ఇచ్చారు. తాను కేవలం నెల్లూరు జిల్లా వైయస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.
తన నియోజక వర్గ బాద్యతలు చూసుకోవాల్సి ఉన్నందునే రాజీనామా చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. పార్టీలో తనకు ఎవరితోనూ విభేదాలు లేవని కూడా స్పష్టం చేశారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ వైసీపీలో జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు.
ఇప్పటికే రాష్ట్రంలోని మెజారిటీ స్ధానాలను టీడీపీ కైవసం చేసుకోగా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పోటీకి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు చెందిన స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో రెండు పార్టీలు క్యాంప్ రాజకీయాలకు తెరతీశాయి.
'నల్లపురెడ్డి రాజీనామాపై వస్తున్న కథనాలు అవాస్తవం'
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి చెప్పారు.
నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ప్రసన్నకుమార్ రెడ్డి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. ఒకపార్టీకి, ఒక వర్గానికి కొమ్ముకాస్తున్న మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications