16 నిమిషాలైనా జైల్లో పెట్టాలని- లీగల్ గానే ఎదుర్కొంటాం-చంద్రబాబు అరెస్టుపై బాలకృష్ణ..
ఏపీలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును నిన్న రాత్రి నంద్యాలలో సీఐడీ సిట్ అధికారులు అరెస్టు చేయడంపై ఆయన సొంత పార్టీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు చోట్ల నిరసనలకు దిగుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు పలువురు ముఖ్యనేతల్ని హౌస్ అరెస్టులు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుపై ఆయన బావమరిది నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు.
జగన్ పాలకుడు కాదు కక్ష్యదారుడని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు దుర్మార్గమన్నారు.జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు.ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో బాలయ్య.. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రతిపక్షనేతలపై కక్ష్యసాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యమన్నారు.

నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడుని 16 నిమిషాలైన జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టు జగన్ కక్ష్యసాధిస్తున్నారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ పెద్ద కుంభకోణమని ప్రచారం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఇది కావాలని రాజకీయ కక్ష్యతో చేస్తున్న కుట్ర అన్నారు.
19.12.2021 లో ఎఫ్ ఐఆర్ నమోదైందని, నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు చార్జ్ షీట్ దాఖలు చేయలేదని బాలయ్య ప్రశ్నించారు. డిజైన్ టెక్ సంస్ధ అకౌంట్ లు ప్రీజ్ చేసి నిధులు స్తంభింపచేసినపుడు కోర్టు మీకు చివాట్లు పెట్టి ఆ డబ్బు నేరానికి సంబంధించింది కాదని ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని బాలయ్య ప్రశ్నించారు. 2.13 లక్షల విద్యార్దులకు శిక్షణ ఇచ్చి 72 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని, దీనిని కుంభకోణం అని ఏ విధంగా అంటారని స్వయంగా హై కోర్టు చెప్పలేదా? అని నిలదీశారు.
మళ్లీ తప్పల మీద తప్పుల చేసి కోర్టుల చేత ఎందుకు తిట్లు తింటారని బాలకృష్ణ వైసీపీ సర్కార్ ను ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారన్నారు. ఎలాంటి అవినీతి లేని కేసులో రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం, ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications