పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో టీడీపీ హవా ! బాలకృష్ణ రియాక్షన్ ఇదే...
ఏపీలో పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ పోరులో టీడీపీ అభ్యర్ధులు ఆధిక్యంలో కొనసాగుతుండటంపై ఆ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి : ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ (TDP) ఆధిక్యం కొనసాగుతోంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ముందంజలో ఉన్నారు. అలాగే తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ ముందంజలో ఉంది. మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 9,558 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రరెడ్డి 1,943 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడు రౌండ్లు ముగిసేసరికి రవీంద్రరెడ్డికి 28,872 ఓట్లు, టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 26,929 ఓట్లు పోలయ్యాయి. అనంతపురం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన రామచంద్రారెడ్డి 169 ఓట్లతో గెలుపొందారు. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఇచ్చిన చంద్రశేఖర్‌రెడ్డి దాదాపు 2వేల ఓట్లతో గెలిచారు.

అయితే చాలా కాలం తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు రెండు చోట్ల ఆధిక్యం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (nandamuri balakrishna) స్పందించారు. ఏపీ జనంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని బాలకృష్ణ తెలిపారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, ఇకపై కూడా ఇలానే ఉంటుందని బాలయ్య తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు ఈసారి యాక్టివ్ గా హాజరవుతున్న బాలయ్య టీడీపీ నిరసనల్లో కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే మండలిలో టీడీపీ నానాటికీ తగ్గిపోతున్న తరుణంలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఆధిక్యంలో కొనసాగుతుండంపై ఆ పార్టీలో సంతోషం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications