లోకేష్ జోలికొస్తే తాట తీస్తా ..కొడాలి నానికి కౌంటర్ ఇచ్చిన నందమూరి వారసుడు !!
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును, లోకేష్ ను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై,నోటికొచ్చినట్టు తిట్టడంపై నటుడు,వ్యాపారవేత్త,నందమూరి వారసుడు నందమూరి చైతన్య కృష్ణ స్పందించారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని తేల్చి చెప్పారు. లోకేష్ జోలికి వస్తే తాటతీస్తా మంటూ వార్నింగ్ ఇచ్చారు.

కొడాలి నాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
ఇప్పటికే బూతుల మంత్రి అని ముద్ర వేసుకున్న కొడాలి నాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంత్రి హోదాలో ఉండి నోటికి ఎంతొస్తే అంత వెధవ, సన్నాసి, దద్దమ్మ పప్పు అంటూ లోకేష్ ను తిట్టడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ ను వేస్ట్ ఫెలో అని ముద్ర వేస్తున్నారని నాని పై విరుచుకుపడ్డారు. ఐటీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ యువతకు ఉద్యోగాలు కల్పించారని, లోకేష్ ను, చంద్రబాబును విమర్శించేందుకు కొడాలి నానికి అర్హత ఉందా అని ప్రశ్నించారు.

ప్రతిపక్షాలను విమర్శించే బదులు పాలనపై దృష్టి పెట్టండి
గ్రామీణాభివృద్ధి శాఖలో గ్రామాలలో రాష్ట్ర వ్యాప్తంగా 12 వేల కిలోమీటర్ల రహదారిని వేయడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని, చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి కనిపించిందని ఆయన తన వీడియో సందేశంలో వెల్లడించారు.తెలుగుదేశం పార్టీ నాయకులపై కొడాలి నానితో పాటుగా, వైయస్సార్ సిపి నాయకులు దుర్భాషలాడటం మానుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్షాలను విమర్శించే బదులు పాలనపై దృష్టి సారించాలని వైఎస్ఆర్సిపి నాయకులకు నందమూరి వారసుడు చైతన్య కృష్ణ సూచించారు.

చంద్రబాబు లోకేష్ లపై ఒక్క అవినీతి కేసు లేదు
చంద్రబాబు పై ఒక అవినీతి కేసు కూడా లేదని, రౌడీయిజం గూండాయిజం అటువంటివి చంద్రబాబు ఇంటా వంటా లేవని,లోకేష్ కూడా అదే బాటలో నడిచిన నాయకుడని చైతన్య కృష్ణ కితాబిచ్చారు. మంత్రిగా పనిచేసిన సమయంలో లోకేష్ చేసిన అభివృద్ధిని చెప్పి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన లోకేష్ పనితీరు చెప్పి సమర్థవంతంగా పని చేసిన నాయకుడు పప్పు ఎలా అవుతారో చెప్పాలని కొడాలి నానిని, వైసీపీ నేతలను ప్రశ్నించారు.

జగన్ కొడాలి నానీ లాంటి వారిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ?
లోకేష్ అవినీతి అరాచకాలు చేస్తే వాటి గురించి మాట్లాడే వాళ్ళని, కానీ అలాంటివి లేకపోవడంతో పప్పు అని ముద్ర వేసి అసమర్ధుడు అంటూ చిత్రించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి మంత్రులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు.ఇప్పటికైనా కొడాలి నాని తీరు మార్చుకోవాలని గతంలో కూడా హెచ్చరించానని గుర్తు చేశారు. నోరు జాగ్రత్త కొడాలి నాని అంటూ వార్నింగ్ ఇచ్చారు నందమూరి వారసుడు నందమూరి చైతన్య కృష్ణ.












Click it and Unblock the Notifications