నందమూరి తారకరత్న తాజా ఆరోగ్య పరిస్థితి ఇలా.. మళ్లీ బెంగళూరుకు బాలకృష్ణ
నందమూరి తారకరత్న తాజా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవటం కోసం మళ్లీ బెంగళూరుకు బాలకృష్ణ వెళ్ళారు. బాలకృష్ణకు వైద్యులు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని వివరించారు.
నందమూరి తారకరత్నకు బెంగళూరు నారాయణ హృదయాలయలో ఇంకా వైద్య చికిత్సలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో నందమూరి తారకరత్నకు ఆసుపత్రిలో చేరిన నాటి నుండి వైద్యం కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడుతోందని నందమూరి కుటుంబం భావిస్తోంది.

బెంగుళూరులో బాలయ్య.. తారకరత్న ఆరోగ్యం ఇలా
నందమూరి తారకరత్నకు సంబంధించి ఇప్పటికే అనేక వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన బ్రెయిన్ డెడ్ రికవరీ చేయడానికి మెదడుకు సంబంధించిన వైద్య చికిత్సలను అందిస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న గుండె, కాలేయం, ఇతర అవయవాలు బాగానే ఉన్నాయని, వైద్యానికి తారకరత్న స్పందిస్తున్నారని చెబుతున్నారు. నందమూరి తారకరత్న ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకుంటున్న నందమూరి బాలకృష్ణ నేడు హైదరాబాద్ నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వెళ్లారు.

తారకరత్న ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడిన బాలయ్య
తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. ప్రస్తుతం వైద్యులు తారకరత్న ఆరోగ్యం కొద్దికొద్దిగా మెరుగుపడుతోందని, అవసరమైన వైద్య చికిత్సలను అందిస్తున్నామని బాలకృష్ణకు చెప్పినట్లుగా సమాచారం. తారకరత్న ఆరోగ్యం గురించి బాలకృష్ణ మొదటినుంచి అన్ని తానే అయ్యి దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వైద్యులతో చర్చిస్తూ, కుటుంబ సభ్యులకు భరోసానిస్తూ, తారకరత్న అభిమానులకు ధైర్యం చెబుతున్నారు. త్వరలోనే తారకరత్న ఆరోగ్యంగా తిరిగి వస్తారు అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తారకరత్నకు మెరుగైన వైద్యం అందిస్తున్న నారాయణ హృదయాలయ వైద్యులు
ఇక నారాయణ హృదయాలయ వైద్యులు తారకరత్నకు ఎప్పటికప్పుడు వైద్య చికిత్సలను అందించడంతో పాటుగా, ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన బులిటెన్లను విడుదల చేస్తూ, ఆయన ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తున్నారు. తారకరత్న అభిమానులు, నందమూరి ఫ్యాన్స్ త్వరగా తారకరత్న కోలుకొని, ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుడిని వేడుకుంటున్నారు.

కాస్త మెరుగుపడుతున్న తారకరత్న ఆరోగ్యం
నందమూరి తారకరత్న జనవరి 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా నడుస్తున్న క్రమంలో తారకరత్న ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వెంటనే టిడిపి కార్యకర్తలు ఆయనను దగ్గరలో ఉన్న కేసీ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుండి ఆయనను ప్రాథమిక చికిత్స అందించి కుప్పంలోని పీఈసీ ఆస్పత్రికి తరలించారు. కుప్పం నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయకు తారకరత్నను తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన నాటి నుండి తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా కొనసాగింది. ఇప్పుడిప్పుడే తారకరత్న ఆరోగ్యం కాస్త మెరుగుపడుతున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications