అణిచి వేయకండి, ఉదయ్ కిరణ్‌ది తప్పు: నన్నపనేని
హైదరాబాద్: ఇండస్ట్రీలో ఎవరు కూడా మరొకరిని అణిచి వేయాలని ప్రయత్నించవద్దని, ఎవరి బతుకును వారిని బతకనివ్వాలని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి మంగళవారం అన్నారు. ఉదయం ఆమె.. ఆత్మహత్య చేసుకున్న టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ భౌతికాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఉదయ్ కిరణ్ ఉదయించిన సూర్యుడిలా పుట్టి, అస్తమించిన చంద్రుడిలా వెళ్లిపోయారని ఉద్వేగంతో అన్నారు. ఏదైనా బతికి సాధించుకోవాలని యువతరానికి సూచించారు. ఎవరు ఎవరిని అణిచివేయవద్దన్నారు. ఎవరి బతుకును వారిని బతకనివ్వాలన్నారు. అసెంబ్లీ లాబీల్లో కూడా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించే మాట్లాడుకుంటున్నారన్నారు.

ఆత్మహత్య చేసుకోవడం ద్వారా ఉదయ్ కిరణ్ చివరలో పొరపాటు చేశారని అభిప్రాయపడ్డారు. ఇది ఆత్మహత్య అయితే ఉదయ్ పొరపాటు చేసినట్లేనని, మరేదైనా జరిగిందా అనే కోణంలో కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, ఉదయ్ కిరణ్ మరణించడం దురదృష్టకరమని, అతని భౌతికకాయాన్ని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయానని నన్నపనేని రాజకుమారి సోమవారం చెప్పిన విషయం తెలిసిందే. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉదయ్ మరణాన్ని ఊహించలేకపోయామని, ఈ అఘాయిత్యానికి కారణభూతులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఉదయ్ కిరణ్ మృతి పట్ల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇలాంటి మరణాలు ఉండకూడదన్నారు. సినీ జీవితాల్లో అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటైందని, ఏది ఏమైనా బతికుండి సాధించుకోవాలని నన్నపనేని హితవు చేశారు.












Click it and Unblock the Notifications