మళ్లీ కెసిఆర్‌పై లోకేష్, కుక్కల్లా: టిడిపిపై బాల్క సుమన్
హైదరాబాద్/ న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రభుత్వం మంత్రివర్గ నిర్ణయాలను కూడా అమలు చేయడం లేదని ఆయన అన్నారు. వారు అన్నీ వదిలేసి చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన అన్నారు. తెరాస ప్రభుత్వం ఇంత వరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదని తప్పు పట్టారు.
ఇదిలావుంటే, తెలుగుదేశం తెలంగాణ నాయకులపై తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బొగ్గు, నీళ్లు ఉన్నా విద్యుత్తు ప్లాంట్లను పెట్టని చంద్రబాబు తన బానిసలతో యాత్రలు చేయిస్తూ కుక్కల్లా మొరిగిస్తే అబద్ధాలు నిజాలు కావని ఆయన అన్నారు. తెలంగాణలో ఆంధ్ర ఆధిపత్యం కొనసాగించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

తెరాసలోకి వలసలను ఆపించేందుకే తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబు యాత్రలు చేయిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ టిడిపి నేతలు యాత్రలు ఆపేసి చంద్రబాబు ఇంటి ముందు దీక్ష చేయాలని ఆయన సూచించారు. కృష్ణపట్నం నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్తును చంద్రబాబు ఆపారనేది వాస్తవం కాదా అని బాల్క సుమన్ ప్రశ్నించారు.
లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టు ఆంధ్రకు పోవడానికి చంద్రబాబు కారణం కాదా అని ఆయన అడిగారు. కరెంట్ చార్జీలు తగ్గించాలని అడిగితే తెలంగాణ రైతులను కాల్చి చంపించిన నైజం చంద్రబాబుదని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు పెంపుడు కుక్కలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు గాదరి కిశోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను అవమానించే విధంగా మాట్లాడితే నాలుకలు చీరేస్తామని ఆయన హెచ్చరించారు. కరెంట్ కష్టాలకు చంద్రబాబు కారణమని ఆయన అన్నారు. టిడిపి తెలంగాణ నేతలు యాత్రలు మానాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications