రెడ్ బుక్ వదిలేశారా ? చంద్రగిరిలో క్యాడర్ కు లోకేష్ క్లారిటీ..!
ఏపీలో గత ఎన్నికలకు ముందే అప్పటి వైసీపీ ప్రభుత్వంలో విపక్షాల్ని టార్గెట్ చేస్తున్న అధికారులు, అధికార పార్టీ నేతల పేర్లను నమోదు చేసిన రెడ్ బుక్ ను ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంత్రి అయిన నారా లోకేష్ పక్కనబెట్టేశారా ? కొంతకాలంగా లోకేష్ రెడ్ బుక్ గురించి ఎక్కడా ప్రస్తావన చేయకపోవడంతో పార్టీ క్యాడర్ లో దీనిపై చర్చ జరుగుతోంది. గతంలో అక్రమాలకు పాల్పడ్డ వారి విషయంలో కక్షసాధింపులు ఉండవని, చట్టప్రకారం వ్యవహరిస్తామని చెబుతున్న చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ అమలు చేయడం లేదనే అసంతృప్తి నెలకొంది. దీనిపై లోకేష్ ఇవాళ స్వయంగా పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారు.

చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెలో ఉత్తమ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యానని నారా లోకేష్ ఇవాళ ఎక్స్ లో పోస్ట్ చేశారు. పార్టీ కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చానని, తన చుట్టూ తిరగడం వల్ల పదవులు రావని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయని మరోసారి స్పష్టం చేసానన్నారు. నాయకుల పనితీరుపై వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామన్నారు.
చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెలో ఉత్తమ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యాను. పార్టీ కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చాను. నా చుట్టూ తిరగడం వల్ల పదవులు రావు. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయని మరోసారి స్పష్టం చేసాను. నాయకుల పనితీరుపై వాట్సాప్ ద్వారా… pic.twitter.com/QEXrWQk9tr
— Lokesh Nara (@naralokesh) January 15, 2025
నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో బాధ్యతగా వ్యవహరించాలని చెప్పినట్లు లోకేష్ వెల్లడించారు. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీలో వ్యవస్థాగతంగా మార్పులు చేస్తున్నామని లోకేష్ తెలిపారు. పాలిట్ బ్యూరోలో ప్రతి రెండేళ్లకు ఒకసారి 30శాతం కొత్తవారు రావాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు. అప్పుడే పార్టీలో మూమెంట్ వస్తుందన్నారు. అహర్నిశలు పార్టీ కోసం పాటుపడ్డవారికే గత ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చామని, కార్యకర్తలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం అని వారికి వివరించినట్లు లోకేష్ తెలిపారు.
అదే సమయంలో రెడ్ బుక్ విషయంలోనూ చంద్రగిరి పార్టీ నేతలకు లోకేష్ క్లారిటీ ఇచ్చారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని నారా లోకేష్ అన్నారు. లిక్కర్, ఇసుక స్కాముల్లో చాలా మంది అరెస్టు అవుతారన్నారు. రెడ్ బుక్ ను పక్కన పెట్టలేదని.. దాని పని అది చేసుకుపోతుందన్నారు. తద్వారా రెడ్ బుక్ పక్కనబెట్టారంటూ జరుగుతున్న ప్రచారంపై లోకేష్ క్లారిటీ ఇచ్చినట్లయింది.












Click it and Unblock the Notifications