రాష్ట్రంలో భయానక పాలన; గిరిజన మహిళా ఉద్యోగి ఆత్మహత్య వైసీపీనేతల వేధింపులతోనే: లోకేష్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతోంది. ప్రధానంగా అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీల మధ్య రోజురోజుకీ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా వైసీపీ నేతల వేధింపులు తాళలేక పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకుందని, కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని రొడ్డా భవాని అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్న లోకేష్ వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేశారు.
జగన్ రెడ్డి అండతో వైసీపీ నేతలు సాగిస్తున్న అరాచకాలకు మరొక గిరిజన మహిళా ఉద్యోగి బలి కావడం రాష్ట్రంలో భయానక పాలనకి అద్దం పడుతోందని నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవానీ వైసీపీ నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్యకి పాల్పడిందని పేర్కొన్న లోకేష్, ఎస్టీ మహిళా ఉద్యోగినిని వేధించి బలవన్మరణానికి కారకులైన వైసీపీ నేతల్ని తక్షణమే అరెస్టు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు ఇప్పటివరకు పట్టించుకోలేదని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల పై దాడులు నిత్యకృత్యంగా మారుతున్నాయని మండిపడిన లోకేష్ డాక్టర్ సుధాకర్ నుంచి భవానీ వరకూ ప్రభుత్వ ఉద్యోగుల మరణాలన్నీ వైసీపీ చేసిన హత్యలే అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ హత్యలని తప్పుదారి పట్టిస్తూ, నిందితులైన వైసీపీ నేతలని పోలీసులు కాపాడుతున్నారు అంటూ ఏపీ లోని పోలీస్ వ్యవస్థ పై కూడా లోకేష్ విమర్శలు గుప్పించారు. అధికారులకీ జగన్ రెడ్డి క్రూర పాలనలో ఇదే గతి పట్టొచ్చు అంటూ లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ బాధితులైన సాటి ఉద్యోగులకి అండగా నిలవండి అంటూ ఉద్యోగులకు లోకేష్ సూచించారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు అన్నీఇన్నీ కాదని లోకేష్ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఎస్సీ , ఎస్టీలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని లోకేష్ నిలదీశారు.












Click it and Unblock the Notifications