అమెరికాలోనూ అధికారంలోకి.. 24ఏళ్ల కుర్రాడిలా బాబు: లోకేష్ ఆసకిక్తర వ్యాఖ్యలు
అమరావతి: అమెరికాలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనిపిస్తోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమెరికా పర్యటన సందర్భంగా లోకేష్ న్యూజెర్సీలో జరిగిన ఎన్నారై టీడీపీ సమావేశంలో ఎన్నారైలనుద్దేశించి మాట్లాడారు. ఈ మేరకు మంత్రి పర్యటన వివరాలను కార్యాలయం ఆదివారం మీడియాకు ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
Recommended Video

ఆ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ.. 'మీ ఉత్సాహం చూస్తుంటే అమెరికాలో కూడా టీడీపీ అధికారంలోకి వస్తుందనిపిస్తోంది' అని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు.

కుర్రాడిలా బాబు
67ఏళ్ల వయస్సులో 24ఏళ్ల కుర్రాడిలా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ప్రపంచంలోని ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని తెలిపారు.

ఫార్మాకు ఐటీ ఫార్ములా..
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగ అభివృద్ధికి అమలు చేస్తున్న నమూనాను ఫార్మా రంగానికి కూడా వర్తింపజేస్తామని రాష్ట్ర మంత్రి లోకేశ్ చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం న్యూజెర్సీలో పలు ఫార్మా కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్లగ్ అండ్ ప్లే మోడల్‌లో ఫార్మా కంపెనీలు రాష్ట్రానికి వచ్చి కార్యకలాపాలు ప్రారంభించే వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు. ఫార్ములేషన్, పరిశోధన-అభివృద్ధి , నైపుణ్య శిక్షణకు ఇంక్యుబేటర్ ఏర్పాటు చేస్తామని, బల్క్ డ్రగ్ అభివృద్ధికి విశాఖపట్నంలో ఫార్మా పార్క్ తీసుకొస్తున్నామని వివరించారు. అన్ని సదుపాయాల కల్పనకు సిద్ధం ఉన్నామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫార్మా కంపెనీలు ముందుకు రావాలని మంత్రి లోకేష్ కోరారు.

పెట్టుబడులతో వస్తే సహకరిస్తాం
అనంతరం ఇదే ప్రాంగణంలో ఐటీ కంపెనీల సీఈఓలతో నిర్వహించిన సమావేశంలో లోకేశ్ మాట్లాడారు. ‘విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో ఐటీ పార్కులు అభివృద్ధి చేస్తున్నాం. కంపెనీల అవసరాన్నిబట్టి భూములు కేటాయించి 50 శాతం అద్దె రాయితీ, ప్లగ్ అండ్ ప్లే మోడల్‌లో కార్యాలయ స్థలం కేటాయిస్తున్నాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారందరికీ ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తాం' అని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఏపీకి పెట్టుబడులతో రావాలని ఆహ్వానించారు.

మీరే బ్రాండ్ అంబాసిడర్లు
అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్.. ప్రవాసాంధ్ర టీడీపీ సమావేశంలోనూ పాల్గొన్నారు. రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని ప్రచారం చేసేందుకు ఎన్‌ఆర్‌ఐలు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌అంబాసిడర్లుగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, ఏపీ ఏఆర్టీ అధ్యక్షుడు రవి వేమూరి, నాట్స్ అధ్యక్షుడు మోహన్‌కృష్ణ మన్నవ, భారీ సంఖ్యలో ఎన్నారైలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications