పాదయాత్రకు నారా లోకేష్ తొలి అడుగు
రాష్ట్రంలోని యువతకు భరోసా ఇచ్చేందుకు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర శుక్రవారం ప్రారంభం కానుంది
రాష్ట్రంలోని యువతకు భరోసా ఇచ్చేందుకు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర శుక్రవారం ప్రారంభం కానుంది. 400 రోజులపాటు 4వేల కిలోమీటర్లపాటు సాగే ఈ యాత్ర ఉదయం 11.03 గంటలకు కుప్పం నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయం నుంచి ప్రారంభం కాబోతుంది. అక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత పాదయాత్రకు తొలి అడుగు వేయనున్నారు. సాయంత్రానికి కుప్పం చేరుకొని అక్కడ జరిగే భారీ బహిరంగసభలో ప్రసంగించారు. పాదయాత్ర 125కుపైగా నియోజకవర్గాల్లో కొనసాగనుంది.

50వేల మంది హాజరవుతారని అంచనా
లోకేష్ పాదయాత్ర ప్రారంభమయ్యేచోటకు రావడానికి రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కదిలారు. దాదాపు 50వేల మందికి పైగా కార్యకర్తలు కుప్పంలో జరిగే బహిరంగసభకు హాజరవుతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, లోకేష్ మామ, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు మొత్తం 400 మంది నేతలు బహిరంగసభ జరిగే వేదికపై ఆశీనులు కానున్నారు. అనంతరం 28వ తేదీన
పీఈఎస్ కళాశాల నుంచి శాంతిపురంలోని అరిముతనపల్లి వరకు లోకేష్ పాదయాత్ర సాగనుంది.

మొదటి మూడురోజులకే అనుమతి
ఈనెల 29న శాంతిపురం మండలంలోని అరిముతనపల్లి నుంచి చెల్డిగానిపల్లె వరకు, కుప్పంలో మొత్తంగా మూడురోజులపాటు 29 కిలోమీటర్లు పాదయాత్ర జరగనుంది. అనంతరం యాత్ర పలమనేరు నియోజకవర్గ పరిధిలోకి ప్రవేశిస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే నెల రోజులపాటు యాత్ర సాగనుంది. 400 రోజులపాటు జరిగే లోకేష్ పాదయాత్రకు అనుమతులపై డీజీపీ కార్యాలయం ఇప్పటివరకు స్పందించలేదు. చిత్తూరు జిల్లా పోలీసులు మాత్రం మొదటి మూడు రోజులకు 29 షరతులతో అనుమతిచ్చారు.

ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడురోజులు
ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడురోజులపాటు పాదయాత్ర జరిగేలా ప్రణాళికలు రచించారు. కుప్పం నుంచి ప్రారంభమై శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వద్ద ముగియనుంది. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. ఏడాదికిపైగా సాగే ఈ పాదయాత్రలో వీలైనన్ని ఎక్కువ గ్రామాలను కవర్ చేయనున్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు చేపడుతున్న ఈ పాదయాత్రలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత పాల్గొనాలంటే 96862 96862 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి యువగళంలో భాగస్వాములయ్యే అవకాశాన్ని కల్పించారు.












Click it and Unblock the Notifications