మోడీ మిసైల్.. దెబ్బకు పాకిస్తాన్ మాయం.. లోకేష్ ప్రశంసల జల్లు..!
అమరావతి రాజధాని పునఃప్రారంభ సభలో మంత్రి నారా లోకేష్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా పాకిస్తాన్ పై పోరుతో పాటు కుల గణన విషయంలో ప్రధాని మోడీ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. అలాగే అమరావతి రాజధానికి ప్రధాని అందిస్తున్న సహకారానికి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.
పాకిస్థాన్ గీత దాటిందని, అమాయకుల్ని చంపి చాలా పెద్ద తప్పు చేసిందని మంత్రి లోకేష్ తెలిపారు. ఒక్క పాకిస్థాన్ కాదు, వంద పాకిస్థాన్లు వచ్చినా భారతదేశం నేల పై మొలిచిన గడ్డి కూడా పీకలేరన్నారు. వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక మిసైల్ మన దగ్గర ఉందన్నారు. ఆ మిసైల్ పేరు నరేంద్ర మోదీ అన్నారు. సింహం ముందు ఆటలు ఆడకూడదన్నారు. మన సింహం నమో కొట్టే దెబ్బకు వరల్డ్ మ్యాప్ లో పాకిస్థాన్ మిస్సింగ్ అని రావడం ఖాయమన్నారు.

పాకిస్థాన్ ఆర్మీ లో పనిచేసే వారు సెలవు పెట్టి పారిపోతున్నారని, కొంత మంది రాజీనామా చేస్తున్నారని లోకేష్ తెలిపారు. దటీజ్ నరేంద్ర మోదీ అన్నారు. నమో కొట్టే దెబ్బకి పాకిస్థాన్ దిమ్మతిరగడం ఖాయమన్నారు. పాకిస్థాన్‌కు ధీటుగా సమాధానం ఇవ్వడానికి దేశం మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అండగా నిలుస్తుందన్నారు. పహాల్గామ్ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు దేశం అండగా ఉంటుందన్నారు.
కేంద్రం కుల గణన చేయాలని తీసుకున్న నిర్ణయం ఒక సంచలనం అని లోకేష్ తెలిపారు. ఇతరులు దశాబ్దాలుగా సంకోచించిన ఒక కీలక అంశంపై మోడీ జీ ధైర్యంగా నిర్ణయం తీసుకుని చరిత్రను తిరిగి రాశారన్నారు. అణగారిన వర్గాలకు సాధికారత కల్పించాలనే నిబద్ధతకు లోబడి మోడీ జీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. వెనుకబడిన వర్గాల సామాజిక న్యాయం కోసం దశాబ్ధాలుగా చేస్తున్న పోరాటాలకు ఈ నిర్ణయం పరిష్కారం చూపుతుందన్నారు.
ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి నినాదాన్ని మాత్రం ఆపలేకపోయారని లోకేష్ తెలిపారు. ఆపడానికి, పీకడానికి అమరావతి ఎవరి ఇంట్లో పెంచుకున్న పెరటి మొక్క కాదన్నారు. జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని అన్నారు. అమరావతికి శంకుస్థాపన చేసింది మన ప్రధాని నమో అన్నారు. ఆయన శంకుస్థాపన చేసిన దానిని ఆపే దమ్ము ఎవడికీ లేదన్నారు. 1631 రోజులు పోరాడి అమరావతిని సాధించుకున్న రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయని, ఇక మనకు తిరుగులేదని లోకేష్ తెలిపారు అమరావతి అన్స్టాపబుల్. అభివృద్ధి వికేంద్రీకరణ జెట్ స్పీడ్ తో జరగబోతుందన్నారు. అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ప్రకాశం జిల్లా లో సిబిజి ప్లాంట్స్ ...ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి అన్ని రకాలుగా ప్రధాని నరేంద్ర మోదీ సహకారం అందిస్తున్నారన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీకి ఆంధ్రప్రదేశ్ అన్నా, అమరావతి అన్నా ఎంతో ప్రేమని లోకేష్ తెలిపారు. ఇప్పుడు ఆయన ఢిల్లీ లో ఎంత బిజీగా ఉన్నారో మన అందరికీ తెలుసని, అయినా ఈ కార్యక్రమానికి వచ్చారన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీయేకి 94 శాతం సీట్లు ఇచ్చారని, ప్రధాని నరేంద్ర మోదీజీ ఆంధ్రప్రదేశ్ కోరిన ప్రతి కోరికను తీరుస్తున్నారని తెలిపారు. గతంలో విశాఖపట్నం వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసి గ్రీన్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కు శంకుస్థాపన చేసారని, విశాఖ ఉక్కును కాపాడారని గుర్తుచేశారు. ఇప్పుడు అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించడమే కాకుండా పనులు తిరిగి ప్రారంభిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications