పల్నాడులో టీడీపీ నేతపై గొడ్డళ్లతో దాడి.. సీఎం జగన్‌కు లోకేష్ వార్నింగ్
పల్నాడులోని రొంపిచర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. మండల పరిధిలోని అలవల గ్రామంలో బాలకోటిరెడ్డి మార్నింగ్ వాక్‌కు వెళ్లిన సమయంలో ప్రత్యర్థులు ఆయనపై గొడ్డళ్లతో విచాక్షణా రహితంగా దాడిచేశారు. తీవ్ర గాయాలైన బాలకోటిరెడ్డిని నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఉద్రిక్తతలకు ఆలవాలమైన పల్నాడులో మరోసారి దాడి ఘటన కలకలం రేకెత్తించింది.

నరసరావుపేట ఆస్పత్రిలో చికిత్స
గతంలో రొంపిచర్ల మాజీ మండలాధ్యక్షుడిగా పనిచేసిన బాలకోటిరెడ్డిపై జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఖండించాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెరుగైన చికిత్స అవసరమనుకుంటే గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తామని వెల్లడించారు. బాలకోటిరెడ్డిపై జరిగిన దాడితో తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అన్యాయాన్ని ప్రశ్నించినవారిపై దాడిచేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ స్థానిక టీడీపీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు.

మీ రాజకీయ పతనానికి కారణమవుతాయి
బాలకోటిరెడ్డిపై జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ ఆధిపత్యం కోసం మీరు చేస్తున్న దాడులు మీ రాజకీయ పతనానికి కారణమవుతాయని హెచ్చరించారు. దాడిలో ఎంపీపీ భర్తే స్వయంగా పాల్గొన్నారంటే మీ రౌడీమూకలు ఎంతకు తెగించాయో అర్థమవుతోందన్నారు. మీ రక్తంలో ఫ్యాక్షన్ మనస్తత్వం ఉందని, అందుకే పాలన రక్తసిక్తమవుతోందన్నారు.

నాలుగింతలు చెల్లించేందుకు సిద్ధంగా ఉండండి
హత్యారాజకీయాలు, దాడులు ఆపాలని, లేదంటే ఇంతకి నాలుగింతలు మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అధికారం, పోలీసులు అండగా వున్నారని వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని, వారికి ఇదే చివరి హెచ్చరిక అన్నారు. వైసీపీ అధికారం కోల్పోతే మిమ్మల్ని ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. మేం తిరబడాలనుకంటే ఎవరూ ఆపలేరని, మీ వెంట వచ్చేవారు కూడా ఎవరూ ఉండదరన్నారు. బాలకోటిరెడ్డిపై దాడిని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. వైసీపీ కార్యకర్తలు అరాచకంగా ప్రవర్తిస్తున్నారని, భౌతిక శాస్త్రంలో చర్యకు ప్రతిచర్య ఎలా ఉంటుందో వైసీపీవారు చేసే ప్రతి పనికి కర్మఫలం ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications