లోకేశ్‌కి బస్తీమే సవాల్?: చంద్రబాబు ప్లాన్ ఫలిస్తుందా?
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలంటూ ఇటీవల కాలంలో టీడీపీకి చెందిన కొందరు మంత్రులు, నేతలు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే నారా లోకేశ్‌కు అనుభవం లేకుండా మంత్రి వర్గంలోకి తీసుకోవడం సబబేనా? అని ప్రశ్నించే వారు లేకపోలేదు. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ తన నాయకత్వ లక్షణాలను నిరూపించేందుకు ప్రభుత్వమే అతని ముందుకు ఓ కొత్త అవకాశాన్ని కల్పించనుంది.
తెలుగు రాష్ట్రాల్లో పలువురు రాజకీయ నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేసీఆర్‌తో నారా లోకేశ్‌ను పోలుస్తూ లోకేశ్‌కు కూడా మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే మంత్రి కేటీఆర్ తన సత్తాను నిరూపించుకుని మంచి నాయకుడిగా తెలంగాణలో ప్రజల చేత మన్ననలను అందుకుంటున్నారు.

ఈ క్రమంలో లోకేశ్‌కు కూడా మైలేజీ పెంచాలనే ఉద్దేశంతో త్వరలో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని 12 మున్సిపల్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. కోర్టు కేసుల కారణంగా ఇప్పటి వరకు ఆయా మున్సిపల్ స్థానాలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి.
అయితే ఇటీవలే ఏపీ ఎన్నికల ప్రధానకారిగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టడంతో ఎన్నికల నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వానికి ఆయన తెలిపారు. జీహచ్ఎంసీ ఎన్నికల్లో అన్నీ తానే మంత్రి కేటీఆర్ ఎలాగైతే టీఆర్ఎస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించారో అదే మాదిరి లోకేశ్ కూడా పార్టీని గెలిపించాలని టీడీపీ నేతల వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం.
అయితే టీడీపీని ఆయా మున్సిపల్ స్థానాల్లో గెలిపించేందుకు గాను చంద్రబాబు ప్రభుత్వం కూడా చేతనైనంత సాయం చేసేందుకు కూడా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో మాత్రం మంత్రి కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం పొందకుండానే ఒంటిచేత్తో పార్టీని గెలిపించిన సంగతి తెలిసిందే.

అంతేకాదు కేటీఆర్ రాజకీయ అనుభవం ముందు లోకేశ్ దిగదుడిపే. అయితే ఇది ప్రజల్లోకి వెళ్లకుండా చంద్రబాబు ముందుగానే జాగ్రత్తలు తీసుకంటున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు అన్ని తానై ఉండి టీడీపీ అభ్యర్దులను గెలిపించి ఆ క్రెడిట్‌ను తన కుమారుడి ఖాతాలో వేసే దిశగా ప్రణాళిక రచించారని సమాచారం.
ఇలా చేయడం ద్వారా తెలంగాణలో కేటీఆర్, ఏపీలో లోకేశ్ ఇద్దరూ సమానమేనని భావన కలిగేలా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలోని కార్పోరేషన్లు అయిన కర్నూలు, గుంటూరు, శ్రీకాకుళం, కాకినాడ, ఒంగోలు, విజయనగరం, తిరుపతితో పాటు బేతంచర్ల, కందుకూరు, రాజాం రాజంపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది.
లోకేశ్ నేతృత్వంలో ఆయా మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి విజయం సాధిస్తే లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని టీడీపీ నేతలు అంటున్నారు. తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నాడు కాబట్టే లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారని అందరూ భావిస్తారని అంటున్నారు.

అలా జరగని పక్షంలో కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు కాబట్టే లోకేశ్‌ను మంత్రి వర్గంలోకి తీసుకున్నారనే విమర్శ వస్తుందని అంటున్నారు. రాజకీయాల్లో చాలా భవిష్యత్తు ఉన్న లోకేశ్‌కు ఈ ఒక్క కారణంతో నేరుగా మంత్రి వర్గంలోకి తీసుకోవడం ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అంతేకాదు ఇప్పటివరకు లోకేశ్ ఎలాంటి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. లోకేశ్ ఖాతాలో టీడీపీకి సాధించి పెట్టిన ఒక్క విజయం కూడా పడలేదు. ఇటీవల తెలంగాణలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తే అక్కడ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. ఇప్పటికీ దీనిపై లోకేశ్ పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో నారా లోకేశ్ తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం అద్భుతమైన అవకాశాన్ని సృష్టిస్తోంది. అయితే ఈ అవకాశాన్ని లోకేశ్ సద్వినియోగపరచుకుని ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకుంటారో లేక ఫెయిల్ అవుతారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications