వారికోసం చేసిన వాగ్దానాలు ఏమయ్యాయి జగన్.. టీడీపీపై కక్ష వారిపై చూపొద్దని లోకేష్ లేఖ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈసారి వాల్మీకి/ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు గతంలో టిడిపి చేసిన కృషిని కొనసాగిస్తూ వారికి లబ్ధి చేకూర్చాలని నారా లోకేష్ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ తాను సీఎం అయిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టి కేంద్రానికి పంపిస్తానని వాగ్దానాలు చేశారని గుర్తు చేశారు.

వాల్మీకి బోయలను ఎస్టీలలో చేర్చాలన్న లోకేష్ లేఖ
టిడిపి ప్రభుత్వ హయాంలో వాల్మీకి/బోయలని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కేంద్రం వద్ద చేసిన కృషిని కొనసాగించి సాధించాలని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశానని పేర్కొన్న నారా లోకేష్ పురాతన కాలం నుంచీ వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ వృత్తిగా జీవనం సాగిస్తున్న నిరుపేద వాల్మీకి/బోయలని ఎస్టీల్లో చేర్చి వారి జీవనస్థితిగతులను మెరుగుపర్చేందుకు తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్న సమయం 2014-19లో విశేషకృషి చేసిందని పేర్కొన్నారు.

వారికిచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి జగన్
ప్రతిపక్షనేతగా వున్నప్పుడు మీరు రాష్ట్రవ్యాప్తంగా వాల్మీకులు/బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తానని, టిడిపి ప్రభుత్వం పంపిన తీర్మానాలు కాకుండా తాను సీఎం అయ్యాక మొదటి అసెంబ్లీ సమావేశాలకే బిల్లు పెట్టి కేంద్రానికి పంపిస్తానని చేసిన వాగ్దానాలు ఏమయ్యాయి వైయస్ జగన్ అంటూ ప్రశ్నించారు. మీరు ముఖ్యమంత్రి అయి మూడేళ్లయినా,చాలాసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా వాల్మీకులు/బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కనీసం చర్చ కూడా చేయలేదని నారా లోకేష్ పేర్కొన్నారు.

వాల్మీకులను ఎస్టీలలో చేర్చటం కోసం మీరు తీసుకున్న చర్యలేంటో చెప్పగలరా ?
వైసీపీ ప్రభుత్వం ప్రచారం కోసం ఇచ్చిన వినతి పత్రాలు కాకుండా వాల్మీకి బోయలను ఎస్టీ లో చేరడం కోసం తీసుకున్న చర్యలు ఏంటో కనీసం ఒక్కటైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. వాల్మీకి జయంతి సందర్భంగా 2021 అక్టోబర్ 20వ తేదీన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో వాల్మీకులను/ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం కోసం చేసిన తీర్మానాలను గుర్తు చేస్తూ వారిని ఎస్టీలుగా గుర్తించవలసిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాశారని పేర్కొన్న నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంలో కనీసం చలనం లేదని మండిపడ్డారు.

కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న తీర్మానాలకు ఆమోద ముద్ర వేయించండి
ప్రభుత్వం ఏదైనా సరే తలపెట్టిన అభివృద్ధి పనులను, సాధించాల్సిన ప్రాజెక్టులను, నిధులను, సమస్యల పరిష్కారానికి జరిగే కృషిని తర్వాత వచ్చే ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే దీనిని ఏపీ ప్రభుత్వం విస్మరించడం వల్ల రాష్ట్రంతో పాటు బోయలు తీవ్రంగా నష్టపోయారని లోకేష్ పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న వాల్మీకులు/ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే తీర్మానాలకు ఆమోదముద్ర వేయించాలని కోరుతున్నామని లోకేష్ వెల్లడించారు.

టీడీపీపై ఉన్న కక్ష వాల్మీకులు/ బోయల పై చూపవద్దన్న లోకేష్
వైసీపీ ప్రభుత్వానికి వాల్మీకులు/ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే చిత్తశుద్ధి ఉంటే కేంద్రం వద్దకు మీతో పాటు మేము వస్తామని లోకేష్ పేర్కొన్నారు. దయచేసి టీడీపీపై ఉన్న కక్ష వాల్మీకులు/ బోయలపై చూపవద్దని లోకేష్ లేఖలో స్పష్టం చేశారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురవుతున్న వాల్మీకులు/ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చ వలసిన అవసరం ఉందని లోకేష్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications