మహిళా వాలంటీర్ పై కమిషనర్ వేధింపులు- బూతులు తిడుతూ- సచివాలయంలోనే ఉండమంటూ-
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే వాలంటీర్లు ప్రభుత్వం ఇస్తున్న 5 వేల రూపాయల వేతనంతో నానా ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు తాజాగా వారికి మరిన్ని వేధింపులు ఎదురవుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది. మహిళా వాలంటీర్ల విషయంలో సచివాలయ సిబ్బందితో పాటు మున్సిపల్ కమిషనర్లు సైతం ఎలా వ్యవహరిస్తున్నారో తెలియజేసేలా ఉన్న ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
గుంటూరు జిల్లా నరసరావుపేటలోని గ్రామ సచివాలయంలో వార్డు వాలంటీర్ గా పనిచేస్తున్న షేక్ అక్తర్ అనే ఓ మహిళపై అక్కడి స్ధానిక కమిషనర్ వేధింపులు తీవ్ర వివాదం రేపుతున్నాయి. సచివాలయంలోనే ఉండమంటూ సదరు కమిషనర్ వాలంటీర్ ను వేధించడం వీడియో సాక్షిగా బట్టబయటలైంది. దీంతో వార్డు వాలంటీర్లు ఎదుర్కొంటున్న వేధింపులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

వాస్తవానికి ఏపీలో ప్రభుత్వం నియమించిన వార్డు, గ్రామ వాలంటీర్లకు నిర్ణీత పనిగంటలు లేవు. అవసరాన్ని బట్టి వారి సేవల్ని సచివాలయాల్లో అధికారులు వాడుకుంటున్నారు. కానీ ఇక్కడ నరసరావుపేటలో మాత్రం సదరు వార్డు వాలంటీర్ పగలంతా సచివాలయంలోనే ఉండాలన్నట్లుగా కమిషనర్ ఆమెను బెదిరిస్తున్న వైనం వివాదాస్పదమవుతోంది. సచివాలయాల సిబ్బంది చేయాల్సిన పనుల్ని కూడా వాలంటీర్లతో చేయిస్తున్నారని ఇఫ్పటికే విమర్శలు వస్తుండగా.. తాజాగా మహిళా వాలంటీర్ అని కూడా చూడకుండా కమిషనర్ రామచంద్రారెడ్డి ఆమెను దూషిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.
షేక్.అక్తర్ అనే మహిళ నరసరావుపేట 3వ వార్డులో వాలెంటీరుగా విధులు నిర్వర్తిస్తుండగా.. అక్కడ అడ్మిన్ గా పనిచేసే నవ్య అనే సచివాలయ ఉద్యోగి ఆమె ఉదయం నుంచి సాయంత్రం వరకూ వాలంటీర్ సచివాలయంలో ఉండటం లేదని కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. అంతే విషయం తెలుసుకున్న కమిషనర్ రామచంద్రారెడ్డి అక్కడకు చేరుకుని ఆమెపై రెచ్చిపోయారు.
నవ్య అనే సచివాలయ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో కమీషనర్ తనతో అసభ్యంగా మాట్లాడారని మహిళా వాలెంటీరు ఆవేదన వ్యక్తం చేశారు. గత జనవరి నెలలో తాను విధులలో చేరినప్పటి నుండి తనకు నిర్ధేశించిన అన్నిపనులూ సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ ఎప్పుడూ సచివాలయంలోనే అందుబాటులో ఉండాలంటూ తనను వార్డ్ అడ్మిన్ వేధింపులకు గురిచేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
Recommended Video
గతంలో నరసరావుపేట 3 వ వార్డు వాలెంటీర్లు అందరూ అడ్మిన్ నవ్యపై కమీషనర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఆ కక్ష్య మనసులో పెట్టుకుని తమను మరిన్ని వేధింపులకు గురిచేస్తున్నారని వాలంటీర్ అక్తర్ తెలిపారు. వార్డు అడ్మిన్ చెప్పారని కమీషనర్ తనను ఫోనులో బూతులు మాట్లాడుతూ నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ... బొక్కలో వేసి తోలు వలిపిస్తా అంటూ బెదిరిస్తున్నారని మహిళా వాలెంటీరు ఆవేదన వ్యక్తం చేశారు. తనతో అసభ్యంగా మాట్లాడిన కమీష్నర్ రామచంద్రారెడ్డి పై మరియు వార్డు అడ్మిన్ నవ్యలపై చర్యలు తీసుకొవాలని మహిళా వాలంటీర్ వేడుకుంటోంది. వాలంటీర్ల వ్యవస్ధే తమ బలంగా చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం నరసరావు పేట ఘటనపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications