ఎంతిస్తారు, ఎప్పుడిస్తారు: మోడీకి నారాయణ! 'వెంకయ్య చెంపపై కొట్టగలరా'
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే.. ఆదుకునేందుకు ఎంతిస్తారు, ఎప్పుడు ఇస్తారో కేంద్రం చెప్పాలని మంత్రి పీ నారాయణ ఆదివారం నాడు అన్నారు. తెలంగాణతోనో, కేంద్రంతోనే కొట్లాడితే సమస్యలు పరిష్కారం కావని వైసిపి అధినేత జగన్ గమనించాలని హితవు పలికారు.
ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. హోదా ఇవ్వకుంటే కేంద్రం ఆ మేరకు ఏం సాయం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఎప్పటిలోగా చేస్తుందో స్పష్టంగా చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు.
ఉద్యోగుల తరలింపుకు గడువు పెంచే ఆలోచన ఏదీ లేదని చెప్పారు. గడువు పెంచితే తరలింపు ప్రక్రియ మరో ఏడాది పడుతుందన్నారు. గడువు పెంచమని స్పష్టం చేశారు. పాలకులు ఓ చోట, ఉద్యోగులు మరోచోట సరికాదన్నారు. జూలై, ఆగస్టుల్లో మిగతా ఉద్యోగులను తరలిస్తామన్నారు.

వారిని చెంపలు వాయిస్తారా: శివాజీ
విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా అయిదేళ్లు సరిపోదు.. పదేళ్లు కావాలి, మేము అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తామని చెప్పిన బీజేపీ సీనియర్ నేతని ఏపీ బీజేపీ నేతలు చెంపలు వాయించి, తర్వాత వారిని రాష్ట్రానికి తీసుకు వచ్చి, ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పించగలరా అని నటుడు శివాజీ ప్రశ్నించారు.
బీజేపీ, టీడీపీ నేతలు పూటకో వ్యాఖ్య చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. మూడేళ్ల కాలాన్ని ఇలాగే కొనసాగించి, నాలుగో ఏడు మళ్లీ దీనిని ఎన్నికల్లో విజయాస్త్రంగా మార్చుకోవాలని భావిస్తున్నారన్నారు.
పార్టీల కుట్రలు చూస్తూ ఊరుకోమని, నిత్యం ప్రజల్లో ఉంటూ చైతన్యం కల్పిస్తామని ఆయన తెలిపారు. పార్టీలు నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి, తర్వాత మాటలు మారిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కంటే బీజేపీ ఎక్కువ చేసిందన్నారు. నమ్మించి గొంతుకోసిన బీజేపీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కాగా, ఏపీకి పదేళ్ల పాటు హోదా కావాలని వెంకయ్య డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications