తెలుగుతేజాలు పూర్ణ, ఆనంద్‌లకు మోడీ సన్మానం
న్యూఢిల్లీ: చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి రికార్డు నెలకొల్పిన తెలంగాణ తేజాలు పూర్ణ, ఆనంద్‌లను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ఢిల్లీలో శుక్రవారం తనను కలిసిన ఆనంద్, పూర్ణలకు ఆయన స్వయంగా జ్ఞాపికను అందజేశారు. భవిష్యత్‌లో మరిన్న విజయాలు సాధించాలని మోడీ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. పూర్ణ, ఆనంద్‌లను మోడీ సన్మానిస్తున్న ఫొటోను ప్రధాని కార్యాలయం అధికారులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
పూర్ణ, ఆనంద్ కుమార్‌లు గురువారం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చిన్న వయస్సులోనే పెద్ద లక్ష్యాన్ని సాధించి దేశంలోని విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో కలిసి ఫొటోలు దిగారు. కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్‌ను కూడా ఆయన కార్యాలయంలో ఆనంద్, పూర్ణలు కలుసుకున్నారు. వారిని మంత్రి గెహ్లాట్ అభినందించారు.
తెలుగుతేజం పూర్ణ చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా ఆనంద్ చరిత్ర సృష్టించాడు. పూర్ణ(14) నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆనంద్(17) ఖమ్మం జిల్లా గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.












Click it and Unblock the Notifications