వైజాగ్ ఆర్కే బీచ్ లో అపశృతి-చంద్రబాబు రాక వేళ..!
విశాఖలో నౌకాదళ దినోత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో సముద్ర తీరంలో ఓ అపశృతి చోటు చేసుకుంది. రేపు నేవీ డే సందర్భంగా జరిగే వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు నేవల్ కమాండ్ సముద్ర తీరంలో విన్యాసాలు నిర్వహిస్తోంది. ఇందులో రెండు పారా చూట్ లో గాల్లో పరస్పరం చిక్కుకుని ముడిపడిపోవడంతో వాటిని నడుపుతున్న ఇద్దరు నేవీ అధికారులు అంతెత్తు నుంచి సముద్రంలో పడిపోయారు.
విశాఖపట్నంలోని రామ కృష్ణ బీచ్ వద్ద తూర్పు నౌకాదళ కమాండ్ నిర్వహిస్తున్న విన్యాసాల్లో ఇద్దరు నేవీ అధికారులు పారా చూట్ లతో సముద్రంపై విన్యాసాలు చేస్తున్నారు. అదే సమయంలో గాలి తాకిడికి వారిద్దరి పారా చూట్లు దగ్గరికి వచ్చేశాయి. వాటిని ఎంత నియంత్రించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో గాలి వాటానికి రెండు పారాచూట్లు దగ్గరిగా వచ్చి వాటి తాళ్లు ముడిపడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన నేవీ అధికారులు గాల్లొనే వాటిని విడదీసేందుకు ప్రయత్నించారు.

అయితే వీరి ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో పారాచూట్లు గాల్లో గతి తప్పాయి. వెంటనే ఒకదాని వెంట మరొకటి సముద్రంలో పడిపోయాయి. దీంతో వాటిని నడుపుతున్న నేవీ అధికారులు కూడా ఆ ఎత్తు నుంచి కిందకు పడ్డారు. అయితే కింద సముద్రంలో ముందుజాగ్రత్తగా ఉంచిన బోట్లలో ఉన్న ఇతర సిబ్బంది వీరిని కాపాడి క్షేమంగా ఒడ్డుకు తీసుకుని వచ్చారు. నేవీ బోటు లేకపోతే మాత్రం వీరు నీటిలో మునిగిపోయేవారని తెలుస్తోంది. దీంతో ఈ రిహార్సల్స్ ను చూసేందుకు అక్కడికి వచ్చిన వారంతా ఊపిరిపీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications