దగ్గరకి రమ్మని బాబు, మీరేంటని టీ మంత్రుల ఝలక్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, ఈటెల రాజేందర్‌లు ఝలక్ ఇచ్చారట! నాలుగు రోజుల క్రితం గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల నాయకులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ సమయంలో ఫోటో సెషన్‌లో గవర్నర్ నరసింహన్, చంద్రబాబు, తెలంగాణ, ఏపీ మంత్రులు ఫోటోలు దిగుతుండగా... టీ మంత్రులు నాయిని, ఈటెలలు కొంత దూరం ఉన్నారట. చంద్రబాబు కలుగ చేసుకొని.. దూరం ఎందుకని, దగ్గరగా రండని సూచించారట. దీంతో నాయిని, ఈటెలలు కాస్త దగ్గరకు వచ్చారట.
అయితే, అదే సమయంలో చంద్రబాబు వారితో మాట్లాడుతూ.. విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా వస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. దానికి తెలంగాణ మంత్రులు నాయిని, ఈటెలలు.. కేసీఆర్ ఎందుకు రాలేదో చెప్పడమే కాకుండా ధీటుగా సమాధానం ఇచ్చారట.

కేసీఆర్ పనుల్లో బిజీగా ఉండటం వల్లే రాలేకపోయారని చెప్పారు. అంతేకాకుండా.... తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్ అదనపు బాధ్యతలను స్వీకరించినప్పుడు మీరు ఎందుకు రాలేదని తెలంగాణ మంత్రులు ప్రశ్నించారట.
కాగా, తెలంగాణ గవర్నర్‌గా గత నెల 2న నరసింహన్ బాధ్యతలు స్వీకరించారు. అప్పుడు చంద్రబాబు హాజరు కాలేదు. ఆ తర్వాత ఇటీవల ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి జాతరలో ఇరువురు సీఎంలు కలుస్తారని అందరు భావించారు. అయితే, ఒకరి తర్వాత మరొకరు వచ్చారు. గవర్నర్ విందులోనైనా వీరు తారసపడతారని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ ఈసారి కేసీఆర్ రాలేదు.












Click it and Unblock the Notifications