రేపు ఎన్డీయే కూటమి నేతగా చంద్రబాబు ఎంపిక - విజయవాడలో ఎమ్మెల్యేల భేటీ !
ఏపీలో ఎన్డీయే కూటమి ఘన విజయం నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా రేపు విజయవాడలో కూటమిలో భాగస్వాములైన టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేల భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో చంద్రబాబును తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయబోతున్నారు.
ఎన్డీయే కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు రేపు విజయవాడలో భేటీ కావాలని నిర్ణయించారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో కూటమి పార్టీల ఎమ్మెల్యేల భేటీ జరగబోతోంది. ఉదయం 9.30కు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఇందులో అధికారికంగా చంద్రబాబును తమ నేతగా వారు ఎన్నుకుంటారు. తర్వాత రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరుతూ లేఖ సమర్పించనున్నారు.

అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్.. చంద్రబాబు ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు. దీంతో ఎల్లుండి సీఎం గా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి మార్గం సుగమం కానుంది. ఎల్లుండి ఉదయం ముఖ్యమంత్రిగా గన్నవరం వద్ద గల కేసరపల్లిలో ప్రమాణస్వీకారం పూర్తి చేసుకున్నాక సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకోబోతున్నారు. అనంతరం పాలనపై దృష్టిసారిస్తారు.












Click it and Unblock the Notifications