ఇటు చంద్రబాబుకు, అటు కాంగ్రెస్‌కు: వెంకయ్య ఒంటరిగా ఢీ!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా ప్రయివేటు మెంబర్ బిల్లు పైన చర్చ సందర్భంగా కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు తన చతురతతో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేశారు.
చర్చ సందర్భంగా బీజేపీ ఓ విధంగా ఒంటరి అయిందని చెప్పవచ్చు. టిడిపి, వైసిపి, తెరాస, బీఎస్పీ, జేడీయు, కాంగ్రెస్ పార్టీ సహా పలు పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో చెప్పాయి. ఈ సమయంలో బీజేపీ ఓ విధంగా ఇరుకున పడింది.
అయితే, వెంకయ్య నాయుడు తన మాటలతో కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపే ప్రయత్నం చేసారు. విభజన సమయంలో ఏపీకి న్యాయం చేయాలని తాము పోరాడామని, అయితే, ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ బిల్లులో పెట్టక పోవడం వల్ల తాము ఏం చేయలేకపోతున్నామని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏపీకి నిధులు ఇచ్చే విషయంలో పరోక్షంగా టిడిపికి ఝలక్ ఇచ్చారు. ఏపీకి నిధులు కేంద్రం సరిగా ఇవ్వడం లేదని టిడిపి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల క్రితం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీకి కేంద్రం నుంచి నిధులు సరిగా రావడం లేదన్నారు.
కానీ, వెంకయ్య ఏపీకి చేసిన సాయంపై పూసగుచ్చినట్లు చెప్పారు. పరోక్షంగా టిడిపికి కౌంటర్ ఇచ్చారు. వెంకయ్య మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక సాయం అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్నో సంస్థలను ఏర్పాటు చేశామన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలను ఆయన వివరించారు. తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాలు ప్రత్యేక హోదా అడుగుతున్నాయని చెప్పారు. 14వ ఆర్థిక సంఘంను కూడా ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా, కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టక పోవడం వల్ల ఇవ్వలేకపోతున్నామని అభిప్రాయపడ్డారు.
తిరుపతి, విశాఖ విమానాశ్రయాలను విస్తరించామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. ముప్పై అయిదు ఏళ్లలో పూర్తి చేయని పోలవరం ప్రాజెక్టును కేవలం రెండేళ్లలో పూర్తి చేయాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని వెంకయ్య ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications