వైసీపీని వీడేందుకే ఆనం వ్యాఖ్యలు-నాకు ఇన్ ఛార్జ్ అందుకే- నేదురుమల్లి రామ్ కామెంట్స్..
ఏపీలో అధికార వైసీపీని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికలకు ముందు సొంతపార్టీలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇదే క్రమంలో తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సొంత పార్టీపై విమర్శల దాడి పెంచుతున్నారు. దీంతో ఆయన స్ధానంలో వెంకటగిరిలో వైసీపీ ఇన్ ఛార్జ్ గా మాజీ సీఎం నేదురుమల్లి తనయుడు రామ్ కుమార్ రెడ్డిని జగన్ నియమించారు.
వెంకటగిరి వైసీపీ ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు ఇచ్చి 24 గంటలు కూడా గడవకముందే నేదురుమల్లి రామ్ తన ప్రత్యర్ధి ఆనం రామనారాయణరెడ్డిపై విమర్శల దాడి మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆనం వ్యాఖ్యల వెనుక ఏముంది, తనకు ఇన్ ఛార్జ్ పదవి ఎందుకిచ్చారన్న దానిపై నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనం చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నట్లు అర్దమవుతోందని నేదురుమల్లి వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై ఆనం ఆరోపణలు చేయడంతోనే ఆయనను తప్పించి తనను ఇన్ ఛార్జ్ గా నియమించారని నేదురుమల్లి వెల్లడించారు.

తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నేదురుమల్లి రామ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. 2024ఎన్నికల్లో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ విజయానికి కృషి చేస్తానన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గ్రామస్థాయి నాయకులను కార్యకర్తలను సరైనటువంటి డైరెక్షన్లో నడపలేకపోయారని నేదురుమల్లి ఆరోపించారు. నియోజకవర్గంలో గ్రూపు తగాదాలను పోషించారని, వాటిని సమన్వయం చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి నుంచి బరిలో దిగే అంశం అధిష్టానం పరిధిలోనిదని నేదురుమల్లి తెలిపారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించిన శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు.












Click it and Unblock the Notifications