గవర్నర్‌కు చాలాసార్లు చెప్పా, కేసీఆర్ సహకరించట్లేదు!: బాబు
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గవర్నర్ నరసింహన్‌కు తాను తెలియజేస్తూనే ఉన్నానని, తెలంగాణ సహకరిస్తే బాగుండేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు. చంద్రబాబు ఢిల్లీలో హైకోర్టు ప్రధాన న్యాయముర్తులు, ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు. ప్రధాని మోడీ అధ్యక్షతన ఇది జరిగింది.
అనంతరం హైదరాబాదుకు తిరుగు పయనమయ్యే సమయంలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టం అమలుపై ఆంధ్రప్రదేశ్ సర్కారు, తెలంగాణ సర్కారు, కేంద్ర ప్రభుత్వం కలిసి కూర్చుని చర్చించుకోవాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం బాధ్యత తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరిస్తే బాగుండేదని, కానీ సహకరించటం లేదన్నారు.
అయినప్పటికీ తాము రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామన్నారు. కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు, వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్‌తో పాటు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కృషి చేశారని, ఆర్థిక మంత్రితో మాట్లాడారన్నారు.

దాని వల్ల రాష్ట్రానికి కొన్ని నిధులు మంజూరయ్యాయని, విభజన చట్టంలో పేర్కొన్న కొన్నింటికి నిధులు విడుదలయ్యాయని తెలిపారు. రాజధానికి రూ.1500 కోట్లు, ఆదాయ లోటుకు రూ.2200 కోట్లు, చిన్న మొత్తాల పొదుపు నిధులు ఇచ్చారని 13వ ఆర్థిక సంఘం బకాయిలు మరో రూ.700 కోట్లు ఇంకా రావాల్సి ఉందన్నారు.
కేంద్రం ఇచ్చిన నిధుల వల్ల గతేడాది ఆర్థిక సమస్యల నుంచి కొంతవరకు బయటపడినప్పటికీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయన్నారు. ఆదాయ లోటు మేరకు ఇంకా రావాల్సిన నిధుల్ని కాగ్ నివేదిక ప్రకారం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. పరిశ్రమలు వస్తే తప్ప ఏపీలో ఆర్థిక కార్యకలాపాలు మెరుగవ్వవని, అవి మెరుగైతే తప్ప ఆదాయం పెరగదని, కాబట్టి పారిశ్రామిక రాయితీలను మెరుగుపర్చాలన్నారు.
వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి గాను ఇప్పటికి ఏడు జిల్లాలకు రూ.350 కోట్లు ఇచ్చారని, వీటిని మరింత పెంచాలని కోరినట్లు తెలిపారు. పోలవరానికి ఖర్చును బట్టి కేంద్రం నిధులు ఇచ్చేందుకు అంగీకరించిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఇబ్బందులు ఉన్నాయని కేంద్రం చెబుతోందని, కానీ అది వస్తే తప్ప రాష్ట్రానికి వెసులుబాటు ఉండదన్నారు.

ఏపీ ప్రజలు విభజనను కోరుకోలేదని, ప్రజలు అంగీకరించకున్నా రాష్ట్రాన్ని విభజించిన నాటి ప్రభుత్వం అందుకు తగ్గ ఫలితం అనుభవించిందని కాంగ్రెస్ పార్టీ పైన మండిపడ్డారు. భౌగోళికంగా రెండు తెలుగు రాష్ట్రాలు వేరైనా మానసికంగా ప్రజలు ఒకటిగానే ఉండాలన్నారు. విభజన సమస్యలు పరిష్కరించుకునేందుకు కూర్చుని చర్చించుకుందాని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.
ఇరు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం కాకుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిష్కరించుకుందామన్నారు. విభజన అనంతరం సంవత్సరానికి పంపకాలపై నోటిఫికేషన్‌ను జారీ చేయాల్సి ఉంటుందని, ఇందుకు మరొక నెలన్నర మాత్రమే సమయం ఉందని అయినా ఇంకా తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాలేదని చెప్పారు. ఎవరెన్ని వివాదాలు సృష్టించాలనుకున్నా తాము ముందుకెళతామని స్పష్టం చేశారు.
అంతకుముందు ఉదయం విజ్ఞాన్ భవన్‌లో జరిగిన సీఎంలు, సీజేల సదస్సుకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏపీ రాజధానిలోనే న్యాయ అకాడమి ఏర్పాటు చేయాలని, తిరుపతి, విశాఖల్లో ప్రాంతీయ పీఠాలు ఏర్పాటు చేయాలని కోరారు. విభజన చట్టం ప్రకారమే హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications