నెల్లూరులో తెగబడ్డ ప్రేమోన్మాది-ఇంట్లోకి చొరబడి యువతి హత్య-తన ప్రేమను కాదన్నందుకు...
నెల్లూరులో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఆమెపై కక్ష పెంచుకున్న అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను లోపలికి చొరబడ్డాడు. ఆపై యువతి గదిలోకి వెళ్లి తలుపులు మూసి హత్య చేశాడు. ఆపై అతను ఆత్మహత్యకు యత్నించాడు. యువతిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు.

అసలేం జరిగింది...
నెల్లూరు జిల్లా గూడూరులో సుధాకర్-సరిత దంపతులు నివసిస్తున్నారు. దంపతులిద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె,కుమారుడు ఉన్నారు. కుమార్తె తేజస్విని ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. ఇదే క్రమంలో సుధాకర్ సహచర ఉద్యోగి చెంచు కృష్ణయ్య కుమారుడు వెంకటేశ్... తేజస్వినితో పరిచయం పెంచుకున్నాడు. కొద్దిరోజులకు అది కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. అయితే ఏడాది కాలంగా వెంకటేశ్ తన ప్రవర్తనతో విసిగిస్తుండటంతో తేజస్విని అతన్ని దూరం పెట్టింది.

ఫోన్ నంబర్ మార్చిన తేజస్విని
వెంకటేశ్‌ను అతని తండ్రి చెంచు కృష్ణయ్య బెంగళూరు పంపించడంతో అక్కడే ఉంటున్నాడు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో అతను తిరిగి గూడూరు వచ్చాడు. అప్పటినుంచి మళ్లీ తేజస్విని వెంటపడటం మొదలుపెట్టాడు. తరచూ ఫోన్లు చేసి ప్రేమ పేరుతో ఆమెను వేధించేవాడు. అతని వేధింపులు భరించలేక తేజస్విని తన ఫోన్ నంబర్ కూడా మార్చేసింది. దీంతో వెంకటేశ్ ఆమెపై మరింత కక్ష పెంచుకుని రగిలిపోయాడు. ఆమెపై దాడి చేసేందుకు అదను కోసం ఎదురుచూడసాగాడు.

స్నేహితుడితో కలిసి ఆమె ఇంటి వద్దకు...
సుధాకర్-సరిత స్కూల్‌కు వెళ్తుంటారు కాబట్టి... ఆ తర్వాత ఇంట్లో తేజస్విని,ఆమె తమ్ముడు మాత్రమే ఉంటారన్న విషయం తెలుసుకున్నాడు. గురువారం (జులై 1) ఉదయం సుధాకర్,సరిత స్కూల్‌కు వెళ్లిన కొద్దిసేపటికి.. వెంకటేశ్,తన స్నేహితుడితో కలిసి వారి అపార్ట్‌మెంట్ వద్దకు వెళ్లాడు. మొదట స్నేహితుడిని తేజస్విని ఫ్లాట్ వద్దకు పంపించి ఆమె ఫోన్ నంబర్ తెలుసుకుని రమ్మన్నాడు. అతను తేజస్విని ఫ్లాట్ వద్దకు వెళ్లి తలుపు కొట్టగా.. ఆమె సోదరుడు తలుపు తీశాడు. ఆమె ఫోన్ నంబర్ ఇవ్వాలని అతన్ని కోరడంతో అందుకు అతను నిరాకరించాడు. ఆ వెంటనే తండ్రికి ఫోన్ చేశాడు.

లోపలికి చొరబడి హత్య...
తండ్రితో ఫోన్‌లో మాట్లాడుతూ తేజస్విని సోదరుడు కిందకు వెళ్లడంతో... అదే అదనుగా వెంకటేశ్ అతని కంట పడకుండా గబాగబా పైకి వెళ్లాడు. తేజస్విని ఫ్లాట్‌లోకి చొరబడి ఆమె ఉన్న గదిలోకి వెళ్లి తలుపులు మూశాడు. ఆపై కత్తితో ఆమె గొంతులో పొడిచాడు. ఆ తర్వాత చున్నీని మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపాడు. ఆపై అదే గదిలో చున్నీతో కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సుధాకర్ పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన వారు అక్కడికి చేరుకున్నారు. తేజస్విని,వెంకటేశ్ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే తేజస్విని మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications