కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి చెక్
నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి చెక్ పడింది. మొన్నటివరకు ఆయన క్యాంప్‌లో ఉంటూ వచ్చిన నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. యూటర్న్ అయ్యారు. కోటంరెడ్డి క్యాంప్‌కు గుడ్‌బై చెప్పారు. మళ్లీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు.
వైఎస్ఆర్సీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఆమెకు పార్టీ కండువాను కప్పి స్వాగతించారు. స్రవంతి భర్త జయవర్ధన్ కూడా ఈ సందర్భంగా వైసీపీ కండువాను కప్పుకొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటైన కార్యక్రమంలో వారు మాట్లాడారు.

పొట్లూరి స్రవంతి జయవర్ధన్ దంపతులను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని నెల్లూరు ఎంపీ, రూరల్ ఇన్‌ఛార్జీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. గతంలో సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్రవంతి దంపతులు పార్టీని వీడినప్పటికీ.. అది తాత్కాలికమేనని వ్యాఖ్యానించారు.
తాను చేసిన తప్పును తెలుసుకొని మళ్లీ పార్టీలో చేరిన స్రవంతి, జయవర్ధన్‌ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోన్నామని అన్నారు. మేయర్ దంపతుల చేరికతో నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ మరింత బలపడినట్టయిందని పేర్కొన్నారు. తమ పార్టీలో విభేదాలను సృష్టించడానికి, నాయకుల మధ్య చిచ్చు పెట్టడానికి తెలుగుదేశం ఎన్ని ప్రయత్నాలు చేసినా, సమష్ఠిగా ఎదుర్కొంటామని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో మరోసారి నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేయబోతోన్నామని వేమిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారని గుర్తు చేశారు. జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ ఖాళీ కాబోతోందని జోస్యం చెప్పారు.
పార్టీలో తిరిగి చేరిన మేయర్ స్రవంతి నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లోని పార్టీ కార్పొరేటర్ల అందరినీ కలుపుకొని, పని చేస్తామని, 2024లో ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని స్రవంతి, జయవర్ధన్ చెప్పారు. మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications