ఏపీలో మందుబాబులకు న్యూఇయర్ గిఫ్ట్..! ప్రత్యేక ఉత్తర్వులు..!
ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. రెండు రోజుల్లో కొత్త ఏడాది 2026 ప్రారంభం సందర్భంగా వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్న వీరి కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇవాళ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలోకి ప్రవేశించే వేళ మందబాబుల సంబరాలు రెట్టింపు కాబోతున్నాయి.
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు, సేవల సమయాలను పొడిగించేందుకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఇవాళ అనుమతి మంజూరు చేశారు. ఈ మేరకు ఎక్సైజ్ , ప్రొహిబిషన్ డైరెక్టర్ సమర్పించిన నివేదికను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రత్యేక అనుమతుల ప్రకారం ఏ4 మద్యం దుకాణాలు డిసెంబర్ 31, 2025, జనవరి 1, 2026 రాత్రుల్లో అర్ధరాత్రి 12.00 గంటల వరకు మద్యం విక్రయించవచ్చు.

అలాగే 2B (బార్లు), సి 1 (ఇన్-హౌస్), ఈపిఐ(ఈవెంట్ పర్మిట్), టీడీ1 (ఇన్-హౌస్) లైసెన్సులు కలిగిన ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంస్థలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయించడానికి, రెస్టారెంట్ సర్వీస్ లకు అనుమతి ఇచ్చారు. గతేడాది కొత్త సంవత్సరం సందర్భంగా అమలులో ఉన్న విధానానికి అనుగుణంగా ఈ సడలింపు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా నాన్-డ్యూటీ పెయిడ్ మద్యం లేదా అక్రమ మద్యం విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల అమలుకు ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్, ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ లు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది.












Click it and Unblock the Notifications