పెళ్ళయి 13రోజులకే భార్యపై అనుమానం, అత్త, భార్యను హతమార్చి.. ఆపై!!
పెళ్ళయి నెలైనా కాకముందే భార్య, అత్తను హతమార్చి, మామపై దారుణానికి యువకుడు పాల్పడిన ఘటన ఏపీలోని కర్నూలులో జరిగింది.
పెళ్లయి నెల రోజులైనా కాకముందే ఓ భర్త భార్యను, ఆమె తల్లిని హతమార్చిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పెళ్ళికి కట్టిన తోరణాలైనా వాడక ముందే కూరగాయలు కోసే కత్తితో అత్తపై, భార్యపై దాడి చేసిన సదరు యువకుడు, మామ పైన కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అసలు ఇంతకీ ఈ దారుణ ఘటన వెనుక కారణం ఏమిటంటే..
వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసముండే వెంకటేశ్వర్లు, రమాదేవి అలియాస్ జ్యోతిల కుమార్తె రుక్మిణి కర్నూలుకు చెందిన శ్రావణ్ కు ఇచ్చి ఈనెల 1వ తేదీన వనపర్తిలో వివాహం జరిపించారు. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా కాపురం చేసుకుంటారని భావించిన సమయంలో, 13 రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. ఇక ఇటీవల వనపర్తిలోని తల్లి గారి ఇంటికి వచ్చిన రుక్మిణిని తిరిగి తీసుకువెళ్లడానికి శ్రావణ్ వచ్చాడు. ఈ క్రమంలో భార్యను కాపురానికి తీసుకువెళ్లడానికి వచ్చిన శ్రవణ్ అత్త రమాదేవిని, మామ వెంకటేశ్వర్లును కూడా కర్నూలు నగరంలోని చింతల ముని నగర్ లో ఉన్న తమ ఇంటికి తీసుకువెళ్లాడు.

ఆపై ఊహించని విధంగా అత్త పైన, భార్య పైన దాడికి పాల్పడ్డాడు. కూరగాయలు కోసే కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. భార్యపై అనుమానంతోనే, ఎవరితోనో సంబంధం ఉన్న భార్యను తనకు అంటగట్టారన్న కోపంతో అత్త పైన, తనను మోసం చేసింది అన్న కోపంతో భార్య పైన, అడ్డు వచ్చినందుకు మామ పైన దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఇక శ్రవణ్ దాడితో తీవ్రంగా గాయాల పాలైన భార్య రుక్మిణి, అత్త రమాదేవి అక్కడికక్కడే మృతి చెందగా, మామ వెంకటేశ్వర్లు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు.
అనుమానం పెనుభూతం కాగా పెళ్లి చేసుకున్న భార్యను, అత్తను చంపిన అల్లుడు, ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. పెళ్లయిన 13 రోజులకే భార్యను అనుమానించి, వారిని కనిపించని లోకాలకు పంపించడమే కాకుండా, అతని జీవితాన్ని కూడా జైలు పాలై నరకప్రాయం చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రావణ్ ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications