రానున్న మూడ్రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అత్యంత తీవ్ర తుఫాను తౌక్టే గడిచిన 6 గంటల్లో 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ.. బలహీనపడి మంగళవారం ఉదయం 8.30గంటలకు సౌరాష్ట్ర ప్రాంతంలో అతి తీవ్ర తుఫానుగా మారిందని తెలిపింది.
అమ్రేలీకి తూర్పుదిశగా 10 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, రాగల 3 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి, మరింత బలహీనపడి తుఫానుగా మంగళవారం సాయంత్రం వాయుగుండంగా బలహీనపడుతుందని తెలిపింది. మే 21న నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, 23వ తేదీన తూర్పు మధ్య బంగాళాఖాతంలో, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

తుఫాను, వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంగళవారం, బుధవారం ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.
గురువారం ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం, బుధవారం దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మరోవైపు మంగళవారం, బుధవారం రాయలసీమలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. గురువారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.












Click it and Unblock the Notifications