విజయవాడ-చిలకలూరిపేట మధ్య ప్రయాణికులకు NHAI గుడ్ న్యూస్..!
కోల్ కతా-చెన్నై జాతీయరహదారిపై విజయవాడ నుంచి చిలకలూరిపేట మధ్య ప్రయాణాలు చేసే వారికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ ఏ ఐ) గుడ్ న్యూస్ చెప్పింది. నానాటికీ రద్దీగా మారుతున్న ఈ బెల్ట్ లో ప్రయాణాలను మరింత సులభతరం చేసేలా ఓ అత్యాధునిక పరిజ్ఞానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. దీంతో ఇకపై ఈ రెండు నగరాల మధ్య ప్రయాణాలు చేసే వారికి ట్రాఫిక్ తో పాటు ఇతర సమస్యలకు చెక్ పడనుంది.
ఎన్ హెచ్ ఏ ఐ దేశవ్యాప్తంగా ప్రధాన జాతీయ రహదారులపై ప్రయాణాల్ని మరింత సౌకర్య వంతంగా మార్చేందుకు అడ్వాన్సెడ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (ఏటీఎంఎస్)ను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ కిలోమీటర్ కు ఓ సీసీ కెమెరా ఏర్పాటు చేస్తారు. వీటిని నిత్యం పరిశీలించేందుకు ఓ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటవుతుంది. ఇందులో సదరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ పరిస్ధితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి తమ టీమ్స్ తో నియంత్రిస్తారు.

అలాగే ప్రమాదాలు జరిగితే వెంటనే గుర్తించి వాహనాలను రోడ్డుపై నుంచి పక్కకు తప్పిస్తారు. అలాగే వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి వాటికి జరిమానాలు కూడా విధించేందుకు స్పీడ్ గన్స్ ఏర్పాటు చేస్తారు. జాతీయ రహదారిపై ఎక్కడెక్కడ ఏయే వేగాలతో వెళ్లాలో నియంత్రణ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు ఈ సిస్టమ్ ను పోలీసు కమాండ్ కంట్రోల్ కు లింక్ చేసి ఆటోమేటిగ్గా జరిమానాలు విధిస్తారు. దీంతో వాహనదారులు ఈ రోడ్డుపై అనుమతించిన వేగాలతోనే ప్రయాణాలు చేయాలి.
ముందు విజయవాడ-చిలకలూరి పేట జాతీయ రహదారిపై ఈ సిస్టమ్ అమలు చేశాక, విజయవాడ పశ్చిమ బైపాస్ పైనా అమలు చేస్తారు. గన్నవరం సమీపంలోని చిన్న అవుట పల్లి నుంచి విజయవాడ శివార్లలో ఉన్న గొల్లపూడి వరకూ నిర్మిస్తున్న 48 కిలోమీటర్ల విజయవాడ బైపాస్ త్వరలో పూర్తి కానుంది. అనంతరం దీనిపైనా ఈ ట్రాఫిక్ సిస్టమ్ అమల్లోకి రానుంది. దీంతో నిబంధనల మేరకు ప్రయాణాలు చేసే వారికి ఇది మేలు చేస్తుందని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications